జై సమైక్యాంధ్ర అనండి, పార్టీని తిట్టకండి: బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపధ్యంలో ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచనలతో సొంత పార్టీనే విమర్శిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాల మేరకు జై సమైక్యాంధ్ర అనొచ్చు గానీ పార్టీని తిట్టకూడదన్నారు. సమైక్యాంధ్ర పేరుతో కాంగ్రెస్‌నే విమర్శించే పార్టీ నేతలపై వేటు తప్పదన్నారు.
పార్టీపై విమర్శలు చేస్తున్న నాయకులను గుర్తించి తుది జాబితాను సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే కొందరు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్‌లను పదవుల నుంచి తప్పిస్తామని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు వ్యవహరించొచ్చని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే విధంగా వ్యవహరిస్తే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు.