కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగి, కర్నూలును రాజధానిగా చేస్తే తన రూ.500కోట్ల ఆస్తిని నగర అభివృద్ధికి రాసిస్తానని భగవాన్ బాలసాయిబాబా ప్రకటించారు. బాలసాయిబాబా జన్మదిన వేడుకలు మంగళవారం కర్నూలులోని శ్రీనిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. బాలసాయిబాబా స్థానికుడైనందున ముందుగా కర్నూలు నగర అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
దీనికి ప్రతిస్పందించిన బాబా కర్నూలును రాజధానిగా చేస్తే రూ.200కోట్ల విలువైన భూములు, రూ.300 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను రాసిస్తానని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే, తన తదనంతరం తన ఆస్తిని దేశానికి అందజేస్తానన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, మంత్రి సారయ్య, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ హాజరయ్యారు.