తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోకమందే, ఆ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన టీఆర్ఎస్, ఓయూ విద్యార్థులు మధ్య పోరు రోజురోజూకు ఉధృతమవుతుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ పునర్ నిర్మాణం అంటే దొరల తెలంగాణనే అని ఓయూ విద్యార్థులు ఆరోపించారు. గురువారం ఓయూ విద్యార్థులు హైదరాబాద్లో ని యూనివర్శిటీ క్యాంపస్లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంత విద్యార్థుల పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని వారు గుర్తు చేశారు.
తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో 3 బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి బహిరంగ వసూళ్లకు పాల్పడుతోందని విద్యార్థులు టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం అయితే ఆయన జేబు నింపుకోవడానికే ఒకరిద్దరు విద్యార్థి నాయకులకు మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారన్నారు. విద్యార్థి నాయకులలో ఒకరిద్దరికి టికెట్లు ఇచ్చి తమను సంతృప్తి పరచడానికి టీఆర్ఎస్ నాటకాలు అడుతుందని ఆ పార్టీపై తెలంగాణ విద్యార్థులు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తీవ్రంగా కృషి చేసిన ఇద్దరు విద్యార్థి సంఘం నాయకులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారని, అయిన ఒకరిద్దరికి మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలపై ఓయూ విద్యార్థులు మండిపడుతున్నారు.