రాప్తాడు, న్యూస్‌లైన్ : మద్యం తమ జీవితాలను దుర్భరం చేస్తోందంటూ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ మహిళలు ఉద్యమబాట పట్టారు. తమ పంచాయతీ పరిధిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలో అయ్యవారిపల్లి, చిన్మయ్‌నగర్, ప్రసన్నాయపల్లి గ్రామాలున్నాయి. దాదాపు పది వేల మంది నివసిస్తున్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులు, కూలీలే. ప్రసన్నాయపల్లిలో రెండు, అయ్యవారిపల్లిలో రెండు, చిన్మయ్‌నగర్‌లో మూడు బెల్టుషాపులు ఉన్నాయి. దీంతో పలువురు మద్యానికి బానిసలవుతున్నారు. కుటుంబ పోషణను గాలికొదిలేస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.
దీనికితోడు గ్రామాల్లో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ అతి తక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తుండడంతో బయట ప్రాంతాల నుంచి సైతం తాగేందుకు వస్తున్నారు. తాగుబోతులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సాయంత్రం ఆరు దాటిందంటే మహిళలు బయటకు రాలేని పరిస్థితి. కళాశాలల నుంచి వచ్చే విద్యార్థినులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్మయ్‌నగర్ నుంచిబృందావనం కాలనీకి వెళ్లే దారిలో తాగుబోతులకు తోడు రాత్రి పూట కొందరు పేకాట ఆడుతూ అటుగా వెళ్లే మహిళలను ఇబ్బంది పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధిలోని మహిళలంతా ఏకమయ్యారు. శుక్రవారం ప్రసన్నాయపల్లిలో సమావేశమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ తీర్మానించారు. వీరికి స్థానిక సర్పంచు భూమిరెడ్డి సావిత్రి, ఉప సర్పంచు రమాదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉషారాణి మద్దతుగా నిలిచారు. ఎస్‌ఐని కలిసి పంచాయతీ పరిధిలో బెల్టు షాపులను మూసివేయించాలని, పేకాటరాయుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
మంచి పరిణామం
పంచాయతీలో మద్య నిషేధం కోసం మహిళలు డిమాండ్ చేయడం మంచి పరిణామం. దీనివల్ల ఎన్నో కుటుంబా లు బాగుపడతాయి. గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడి మహిళల్లో వచ్చిన చైతన్యం ఇతర ప్రాంతాల వారికి స్ఫూర్తినిస్తుందని ఆశి స్తున్నా.
- భూమిరెడ్డి సావిత్రి, ప్రసన్నాయపల్లి సర్పంచ్
మద్యం అమ్మకాలను నిషేధించాలి
పగలంతా పని చేసి త ద్వారా వచ్చే డ బ్బుతో పీకల దాకా తాగి రాత్రి ఇంటి కొచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. చా లామంది కష్టార్జితాన్ని మద్యానికి తగలేసి చిన్న వయసులోనే రోగాల బా రిన పడుతున్నారు. దీనివల్ల అనేక కుటుంబాలు ఆర్థికం గా చితికిపోయాయి.
- రమాదేవి, ఉపసర్పంచ్
మద్యం పంపిణీ అరికట్టాలి
గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలు కావడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా చితికి పోయాయి. ఎన్నికల సమయంలో కొందరు రాజకీయ నేతలు మద్యం పంపిణీ చేసి.. ఓట్లు దండుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారి ఆటలకు చెక్ పెట్టాలంటే మద్య నిషేధాన్ని అమలు చేయాలి.
- ఉషారాణి, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా
ప్రధాన కార్యదర్శి
మద్యంపై మహిళోద్యమం
Published Sat, Feb 22 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement