కర్షకులను కాలరాస్తున్న బాబు | Violates farmers Launches | Sakshi
Sakshi News home page

కర్షకులను కాలరాస్తున్న బాబు

Published Fri, Mar 6 2015 1:54 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

కర్షకులను  కాలరాస్తున్న బాబు - Sakshi

కర్షకులను కాలరాస్తున్న బాబు

తాడేపల్లి రూరల్/మంగళగిరి/తాడికొండ : రాజధాని ప్రాంత పర్యటనకు గురువారం వచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ఎదుట ఆయా గ్రామాల రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి పట్టెడన్నంపెట్టే రైతులను కాలరాస్తున్నారని ఆక్రోశించారు. తెలుగుదేశం నేతలు, అధికారులు సృష్టించిన భయాందోళనలను చెప్పుకుని బాధపడ్డారు. భూ సేకరణకు వెళతామని పాలకులు బెదిరించడం వల్లనే తమ భూములు ఇచ్చామని తేల్చిచెప్పారు.
 
  ఏళ్ల తరబడి భూమి తల్లినే నమ్ముకున్న తాము ఇప్పుడెలా బతకాలని ప్రశ్నించారు. పిల్లల చదువులు, వివాహాలు ఎలా చేయాలని కలత చెందారు. ఓ దశలో ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తుంది గదా అని చెప్పబోయిన పవన్‌కల్యాణ్‌పై సైతం అసహనం వ్యక్తం చేశారు. దాంతో రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం,నవూలూరు మీదుగా బేతపూడి,తుళ్లూరు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది.
 
 తొలుత ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి చేరుకున్న పవన్‌కల్యాణ్ చిన ఆంజనేయ స్వామి సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. భూసమీకణకు సంబంధించి రైతులను మాట్లాడవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన రైతు పోలిశెట్టి అనంతశివరావ్ మాట్లాడుతూ ప్రభుత్వం భూమి లాక్కుంటుందన్న భయంతో అంగీకార పత్రం ఇచ్చానన్నారు.
 
  తన భూమి నుంచి తనను దూరం కాకుండా కాపాడాలని కోరారు.మరో రైతు సింగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని రాకముందు ఇక్కడ ఎకరా ధర ఐదు నుంచి ఏడు కోట్ల  వరకు ఉండేదనీ, ఇప్పుడు కోటి రూపాయలకు పడిపోయిందన్నారు. రాజధానికి భూములు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరిస్తున్నామన్నారు. రైతు గంగిరెడ్డి శంకరరావు మట్లాడుతూ 30 ఏళ్లు కష్టపడి పొలం కొనుకున్నాం. ఇప్పుడు ఆ పొలం ప్రభుత్వం తీసుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటోంది. మరి మేం ఎలా బతకాలని ప్రశ్నించారు.
 
 మంగళగిరి మండలంలోని భూ సమీకరణ గ్రామాలైన ఎర్రబాలెం, బేతపూడిలో పవన్‌కల్యాణ్ పర్యటించి రైతులతో మాట్లాడించారు. ఓ దశలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పవన్ ఉదయం పదకొండు గంటలకు ఎర్రబాలెం చేరుకున్నారు. అభిమానుల కోలాహలం మధ్య రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు జెడ్పీటీసీ ఆకుల జయసత్య, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాయుడు శ్రీనివాసరావు వేదికపై వున్నారు. రైతులతో మాట్లాడించాలని వారిని కోరారు.ఇదే గ్రామానికి చెందిన రైతు రాంబాబు మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు లాక్కుంటే తామెలా బతకాలని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ గురించి పవన్‌కల్యాణ్ చెప్పబోతుండగా, తాము భూములు ఇవ్వబోమని చెపుతుంటే ప్యాకేజీ అంటారేమిటీ అని ఆ రైతు అసహనం వ్యక్తంచేశారు. దీంతో నువ్వు వైఎస్సార్ సీపీనా అని పవన్ ప్రశ్నించి అయినా అభ్యంతరం లేదని అంటుండగానే పోలీసులు వచ్చి రైతును వేదిక నుంచి కిందకు నెట్టారు.
 
 అక్కడే ఉన్న పెనుమాక గ్రామానికి చెందిన రైతు ముప్పెర సుబ్బారావు మాట్లాడుతూ తాము తొలి నుంచి తెలుగు దేశం పార్టీకి ఓట్లు వేస్తున్నామన్నారు. నలుగురు అన్నదమ్ములమనీ, ఆ కుటుంబాలన్నీ టీడీపీకి ఓట్లు వేస్తున్నాయనీ,  ఇప్పుడు రాజధాని పేరుతో భూములు లాక్కుంటే తమ పిల్లల చదువులు,వివాహాలు ఎలా అని ప్రశ్నించారు. దయచేసి తమ గ్రామాలను రాజధాని భూ సమీకరణ నుంచి మినహాయించే విధంగా చూడాలని  రైతు కోరారు.
 
 ఎర్రబాలెం గ్రామానికి చెందిన పలగాని కోటయ్య, నాయుడు చిన్నమ్మాయిలతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ కేవలం భూ సమీకరణ గడువుకు రెండు రోజుల ముందు మంత్రులు, అధికారులు భూ సేకరణ చేస్తామని బెదిరించడంతో సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చామన్నారు. తామంతా సన్న, చిన్న కారు రైతులమని భూములను కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంలో జెడ్పీటీసీ ఆకుల జయసత్యను రాజధానికి భూమి ఇస్తావా లేదా అంటూ పవన్ ప్రశ్నించగా, ఆమె మౌనంగా ఉండిపోయారు.
 
 బేతపూడిలో ...
 అక్కడ నుంచి బేతపూడి గ్రామం చేరుకున్న పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాలలో రైతులతో సమావేశమయ్యారు. ఆ గ్రామానికి చెందిన కొలపల్లి అచ్చమ్మ, వాసా రాజు, వసంతరావుతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ, ఇప్పటికే ఇక్కడ రెండుసార్లు భూ సేకరణ చేశారనీ, తిరిగి  భూములు లాక్కుంటే తామంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనన్నారు. అనంతరం అభిమానుల కోలాహలం పెరగడంతో రైతులు మాట్లాడలేక పోయారు. నార్త్‌జోన్ డీఎస్సీ జి.రామకృష్ణ, సీఐలు చిట్టెం కోటేశ్వరరావు, శేషారావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు.
 
 తుళ్లూరులో తోపులాట...
 పవన్‌కల్యాణ్ తుళ్లూరు చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఓ దశలో ఆయన అభిమానులను నియంత్రించడం పోలీసులకు సైతం సాధ్యపడలేదు. పవన్ రాకకోసంఉదయం నుంచే టీడీపీ శ్రేణులు, పవన్ అభిమానులు గుంటూరు, కృష్ణా జిలాల్ల నుంచి ఇక్కడకు భారీగా తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కట్టడి చేయలేకపోయారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించిన అనంతరం కారు ఎక్కే సమయంలో కొంత తోపులాట జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పువ్వాడ సుధాకర్ అధ్యక్షత వహించారు. మాజీ జెడ్పీటీసీ దామినేని శ్రీనివాసరావు, లింగాయపాలెం మాజీ సర్పంచ్ అనుమోలు సత్యనారాయణ, టీడీపీ నాయకులు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. ముందస్తుగా ప్రధాన కూడళ్లలోని దుకాణాలను మూసివేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement