
కలకలం
సాక్షి, కడప : ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పట్టుబడుతున్న నిందితులను పరిశీలిస్తే కలకం రేగుతోంది. కాసులకు కక్కుర్తి పడి ఏకంగా ఎర్రచందనం కూలీలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వాడడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారాన్ని జిల్లా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు వ్యవహారం బట్టబయలైంది.
తమ నిఘాను దాటి ఎర్రచందనం కూలీలు తమిళనాడు నుంచి ఎలా వస్తున్నారని పోలీసులు నిశితంగా గమనించడంతో ఆర్టీసీ డ్రైవర్ల చేయూత వ్యవహారం వెలుగుచూసింది. నందలూరుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రిజర్వేషన్ చార్టు, టిమ్స్ (టిక్కెట్లు ఇచ్చే) యంత్రం, డ్యూటీ చార్టు ఆధారంగా పోలీసులు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన సుమారు 41 మంది డ్రైవర్లను ఇప్పటివరకు అరెస్టు చేశారు.
డ్రైవర్లు చెన్నై కోయంబేడు బస్టాండు నుంచి రైల్వేకోడూరు అటవీ ప్రాంతానికి కూలీలను తీసుకు వచ్చేవరకు బస్సులో మరెలాంటి కొత్త ప్రయాణికులను ఎక్కించుకునే వారు కాదు. పైగా మధ్యలో ఎక్కడైనా స్టేజీలు ఉన్నా నిలుపకుండా నేరుగా తీసుకెళ్లి కోడూరు అటవీ ప్రాంతంలో దించేవారు. అంతేకాకుండా జిల్లాకు చెందిన వింజమూరు రామనాథరెడ్డి అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ను అరెస్టు చేయడం కూడా కలకలం సృష్టించింది. వైఎస్సార్ జిల్లాతోపాటు అటు నెల్లూరు, ఇటు కర్నూలు జిల్లాల్లో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహం సంఘటన సంచలనం సృష్టించింది.
30 మంది డ్రైవర్ల అరెస్టు
తమిళ కూలీలను అక్రమంగా తీసుకు వస్తున్న కర్నూలు జిల్లాలోని మూడు డిపోలకు చెందిన 30 మంది డ్రైవర్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ సోమవారం వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 11మందిని అరెస్టు చేశామని, మరో 30 మందిని సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. వీరంతా చెన్నైలో తమిళ కూలీలను ఎక్కించుకుని కోడూరు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చేవారని, బస్సు బస్టాండుకు తీసుకెళ్లకుండా బైపాస్ మీదుగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలే వారన్నారు.
వీరందరినీ గుంపగుత్తగా తరలించినందుకు ఆర్టీసీ డ్రైవర్‌కు కూలీలు రూ. 2 వేల నుంచిరూ. 3 వేలు అందించేవారన్నారు. నంద్యాల డిపోకు చెందిన కేఎస్ రాముడు, వైవీ రంగయ్య, బీఎన్ రాజు, ఎస్.మహబూబ్, జీఎస్ వాసులు, కె.నాగేంద్ర, ఎస్‌ఏ సత్తార్, పీజీ కృష్ణ, ఎస్.ఇస్మాయిల్, ఎస్.షబ్బీర్, పీసీ శేఖర్, కె.కలీముల్లా, ఎస్‌ఆర్ బాషతోపాటు ఆళ్లగడ్డ డిపోకు చెందిన బీఎన్ రాజు,సి.కుళ్లాయప్ప, డి.దానం, ఎస్‌కే అల్తాఫ్, ఎస్‌ఏ సలేహా, వీడీ గిరి, ఎ.శివుడు, కేఆర్‌కే రెడ్డి, ఎంఎన్ రెడ్డి, ఎస్‌బి రెడ్డి, ఎస్‌సీ బాష, జి.ప్రసాద్‌లతోపాటు ఆత్మకూరు డిపోకు చెందిన ఎస్.మజీద్, బీఆర్‌కే సింగ్, ఎంఎస్ హుసేన్, ఎంఎస్‌ఆర్ రెడ్డి, కేవీ వహాబ్‌లను అరెస్టు చేశారు.
అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్టు
చాపాడు మండలం చెండ్లూరు గ్రామానికి చెందిన రామనాథరెడ్డి చెన్నైకి చెందిన శాహుల్‌భాయ్, బెంగుళూరుకు చెందిన రోషన్‌కు ఎర్రచందనం రవాణాచేసేవాడు. ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బులతో వింజమూరులో రూ. 2 కోట్లతో ఇల్లు, 3.65 ఎకరాల పొలం, ఇంటిస్థలాలు కొన్నట్లు ఎస్పీ వివరించారు.
ఇతనిపై ఇప్పటివరకు బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు, అర్బన్‌లో నాలుగు కేసులు, ఖాజీపేట, బి.మఠంలలో ఒక్కొక్క కేసు, కర్నూలు జిల్లాలోని అనంతసాగరం, డోన్‌లలో ఒక్కొక్క కేసు, చిత్తూరు జిల్లా చంద్రగిరి, నెల్లూరుజిల్లా సోమశిల, అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు పరిధిలో ఒక్కొక్క కేసు కలుపుకుని మొత్తం ఐదు జిల్లాల్లో 15 ఎర్రచందనం కేసులు నమదైనట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇది మరో అంతర్జాతీయ స్మగ్లర్ రోషన్ కథ!
రామనాథరెడ్డితోపాటు బెంగుళూరుకు చెందిన నజీర్ అహ్మద్ అలియాస్ రోషన్ ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి టీవీ, కార్ల మెకానిక్‌గా పనిచేసేవాడు. ఈ నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లర్ రియాజ్‌తో పరిచయం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఎర్రచందనం కొనడం, ప్రధాన స్మగ్లర్ అయిన అక్రంకు విక్రయిస్తుండేవాడు. వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లతో రోషన్ పరిచయాలు ఏర్పరుచుకుని వారి ద్వారా ఇప్పటివరకు 16సార్లు ఎర్రచందనం కొనుగోలుచేసి అక్రంకు అమ్మినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
రోషన్‌న్‌పై బద్వేలు అర్బన్, రూరల్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదయ్యూరుు. వీరిద్దరితోపాటు చుండూరు గ్రామానికి చెందిన జి.పవన్‌కుమార్‌రెడ్డి, బి.మఠంకు చెందిన డేరంగుల సుబ్రమణ్యం, రాయపురెడ్డి, జయరామిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన పులి ఎద్దుల కొండారెడ్డి, నెల్లూరు టౌన్‌కు చెందిన అక్కులరెడ్డి నారాయణరెడ్డి, వింజమూరుకు చెందిన దాదిరెడ్డి మస్తాన్‌రెడ్డి అలియాస్ మస్తాన్, అట్లూరు మండలం సూరాయపల్లెకు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివసిస్తున్న సుంకర ఈశ్వర్, శివానగర్‌లో నివసిస్తున్న అబ్బు భాస్కర్, బెంగుళూరు నగరానికిచెందిన అంజాదుల్లాఖాన్ తదితరులను అరెస్టు చేశామన్నారు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలోకూలీలకు సహకరించిన ఆర్టీసీ డ్రైవర్లతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయస్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నవీన్‌గులాఠీ అభినందించారు.