- గృహనిర్మాణ శాఖలో 201 మంది తొలగింపు
- జూలై 1 నుంచి అమలు
- ఎండీ ఆదేశాలు
బి.కొత్తకోట: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. కొత్త ప్రభుత్వంలో తమకు మంచి జరుగుతుందన్న వీరి ఆశలు గల్లంతయ్యాయి. తొలి అస్త్రం గృహనిర్మాణ శాఖపై ప్రయోగించారు. దీంతో 201 మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 2004కు ముందున్న ప్రభుత్వాలు నియోజకవర్గానికి 500 నుంచి 1,000 లోపు గృహాలను మంజూరు చేస్తూ వాటి నిర్మాణాల బాధ్యతలను వర్క్‌ఇన్‌స్పెక్టర్లకు అప్పగించడం జరిగేది. వర్క్‌ఇన్‌స్పెక్టర్లు రెండు లేక మూడు మండలాలకు కలిపి ఒకరుండేవారు. అయితే 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణ శాఖకు ప్రాధ్యాన్యం ఏర్పడింది.
ప్రతిపేదకూ పక్కాగృహం మంజూరు చేసేందుకని 2005-06లో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాకు 3,51,104 గృహాలను మంజూరు చేశారు. దీంతో గృహనిర్మాణ శాఖ కీలక శాఖగా మారింది. వేల కోట్లను ఖర్చు చేసే శాఖగా మారిపోవడంతో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణల పర్యవేక్షణ, వేగవంతం కోసం చర్యలు చేపట్టారు.
మండలాలకు ఏఈలు, కొత్తగా సబ్‌డివిజన్లను ప్రారంభించారు. అలాగే పాలన, పనుల వేగవంతం, పర్యవేక్షణ కోసం కొత్త ఉద్యోగాల నియామకం చేశారు. మండలాలకు ఔట్‌సోర్సింగ్ ద్వారా మండల స్థాయి ఏఈల నుంచి వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, డెటాఏంట్రీ ఆపరేటర్లను నియమించారు. జిల్లాలో 2006 నుంచి వీరి నియామకం సాగుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 7 మంది మండల స్థాయి ఏఈలతో పాటు 201 మంది ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్నారు.
కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే వినియోగించుకోవాలని, జూలై1 నుంచి కొనసాగించరాదని ఆదేశాలు వచ్చాయి.
దీంతో జిల్లాలో 201 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడనున్నారు. జూలై 1 తర్వాత ఎవరు ఆదుకుంటారు, కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని శాఖల్లో కూడా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.