- అరుదైన కోర్సులను తొలగించడం బాధాకరం
- ఇతర కళాశాలల్లో సంగీతాన్ని సరిచూడకూడదు
- ప్రఖ్యాత మృదంగ విద్వాన్ ఎల్లా వెంకటేశ్వరరావు
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: సంగీత కళను బతికించాల్సిన ధర్మం, బాధ్యత టీటీడీపై ఉందని ప్రఖ్యాత మృదంగ విద్వాన్, టీటీడీ ఆస్థాన విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శ్రీవారి దర్శనార్థం ఆయన శుక్రవారం తిరుపతికి వచ్చారు. అనంతరం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ఉదయం తిరుపతికి రాగానే సాక్షి దినపత్రికలో ‘సంగీతానికి మంగళం’ అన్న కథనం చూశాను. మనసంతా ఆందోళన కలిగించింది. సంగీతన్ని ప్రోత్సహించాల్సిన టీటీడీనే సంగీత కళలపై ఇలా వ్యవహరించడం బాధాకరం.
కళాశాలలో అరుదైన కోర్సులను ఎత్తివేయడం అంటే సంగీతం గొంతునొక్కడమే. అంతరించి పోతున్న సంగీత కళల్ని ఆదరించాల్సిన టీటీడీనే భారం తగ్గించేందుకు ప్రయత్నించడం అన్యాయం. సంగీతానికి, కళాకారులకే ఎందుకు ఇలా జరుగుతోంది?. కళకు ప్రాణం పోయాల్సిన టీటీడీనే ఇలా వ్యవహరిస్తే కళ ఏం కావాలి?. కళాకారులు ఎక్కడికి పోవాలి!. సంగీత కళాశాలవల్ల టీటీడీకి ఏం లాభం అనడం సరైంది కాదు. శ్రీవారికి రోజూ అలంకణ అవసరమా ఖర్చు ఎందుకులే అనుకుంటే ఎలా..?
అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్‌లకు సంగీతమంటే అపారమైన ప్రేమ ఉంది. వీళ్లు కళల్ని ఎంతగానో ప్రొత్సహించారు. అలాంటి వ్యక్తుల పాలనలో కళకు ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆరాతీశాను. సంగీతంతో బతుకుతున్న వారిలో కొందరు తమ స్వార్థం కోసం అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కళాశాలపై, కళాకారులపై అధికారులకు సరైన సమాచారం ఇవ్వకనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది.
సంగీతం ఒక్క ఏడాదిలో నేర్చుకునేదికాదు
విద్యలన్నింటిలో సంగీత విద్య అత్యంత కష్టతరమైంది. చదివితే వచ్చేదికాదు. నాదోపాసన ద్వారా, సాధనతో నేర్చుకుంటే సంగీతంలో రాణించేదుకు వీలుంటుంది. సంగీతం అందరికీ రాదు. చదివిన వారంతా ఐఏఎస్‌లు కాలేరు. అలాంటిది సంగీతం ఏడాదిలో నేర్చుకుంటే చాలనడం అవగాహనలేని వాళ్లు మాట్లాడే మాటలు.
కళాకారులను వేధించడం తగదు
అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో కళాకారులను అధికారుల వేధిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కళాకారులకు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు పెడతారు.. ఇంకెన్ని సార్లు వేధిస్తారు. కళాకారులందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు.