పాలకొండ ఎమ్మెల్యే కళావతికి పితృ వియోగం | Palakonda MLA Kalavathi Father Death | Sakshi
Sakshi News home page

పేదల దొర ఇక లేరు..

Published Tue, Aug 20 2019 8:37 AM | Last Updated on Tue, Aug 20 2019 9:10 AM

Palakonda MLA Kalavathi Father Death - Sakshi

విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామా.. నిస్వార్థ సేవకు ప్రతిరూప మైన రాజకీయ కురువృద్ధుడు విశ్వాసరాయి నరసింహరావుదొర (95) భౌతిక దేహాన్ని వీడి అనంత లోకాల్లో కలిసిపోయారు.. వండవ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి.. స్వతంత్ర అభ్యర్థిగానే ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న ఈ అరుదైన నాయకుడు జిల్లాకు ఎన్నో సేవలందించారు. వండవ దొరగా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ ప్రజా నేత ఎన్నో సమున్నత రాజకీయ విలువలను నెలకొల్పారు. ఆయన వారసురా లిగా రాజకీయాల్లో రాణిస్తున్న ఎమ్మె ల్యే కళావతి తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఐదుగు రు కుమార్తెలలో ఆమె చివరివారు. వండవ దొరకు ఇంకా భార్య, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువజామున స్వగ్రామం వీరఘట్టం మండలం వండవ గ్రామంలో కన్నుమూశారు.

సర్దార్‌ గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాములనాయుడు ఆయనకు రాజకీయ గురువులు. ఆయన 1956లో వండవ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి 1967లో పార్వతీపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 1972లో కొత్తూరు శాసనసభ సభ్యునిగా ఇండిపెండెంట్‌గా పో టీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. 1978లో జనతాపార్టీ ఎమ్మెల్యేగా, 1985లో కాంగ్రెస్‌ పార్టీ (ఐఎన్‌సీ) తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. ఇలా ఒకసారి ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సేవలందించడమే కాక గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌గా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వండవ, వీరఘట్టం సొసైటీ అధ్యక్షునిగా 30 ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణవార్త తెలియగానే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు.

రఘట్టం/పాలకొండ రూరల్‌: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయ కురువృద్ధుడిగా, గిరిజన నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్యే విశ్వాసరాయి నరసింహరావుదొర(95) భౌతికంగా దూరమయ్యారు. పేదల దొరగా, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయడం కోసం ఎంత దూరమైన వెళ్లే వండవ దొర.. తిరిగి లోకాలకు పయనమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వీరఘట్టం మండలం వండవలోని తన స్వగృహంలో సోమవారం ఉదయం 8.45 గంటకు పరమపదించారు. 
దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి మరణవార్త విన్న చిన్న కుమార్తె, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తండ్రి పార్థివదేహంపై పడి గుండెలలిసేలా రోధించారు. చిన్ననాటి నుంచి తన తండ్రితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆమె రోధించిన తీరు అక్కడ వారిని కలచివేసింది. బరువెక్కిన హృదయాలతో గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ దశలో ఎమ్మెల్యే కళావతిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

వండవ.. కన్నీటి సంద్రం..
వండవ దొర మరణవార్త విన్న జిల్లా యంత్రాంగం, రాజకీయ ప్రముఖులు, దొర స్నేహితులు, బంధువర్గం తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. ఆయనను కడసారి చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ వండవ చేరుకుని, దొర పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కళావతిని ఓదార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తరలి రావడంతో వండవ గ్రామం జనసంద్రమైంది.

మంత్రి కృష్ణదాస్‌ నివాళి..
నిగర్వి, అజాత శత్రువుగా పేరుగాంచిన వండవదొర మరణవార్త విన్న వెంటనే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ హుటాహుటిన వండవ చేరుకొని, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. దొర భౌతిక కాయంపై పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కళావతితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. అలాగే రాజాం, సాలూరు ఎమ్మెల్యేలు కంబాల జోగులు, పి.రాజన్నదొర, స్పీకర్‌ తమ్మినేని సీతారాం తనయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవినాగ్‌ గ్రామానికి చేరుకుని కళావతిని ఓదార్చారు. అలాగే మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పాలవలస పాలవలస ఇందుమతి, వీరఘట్టం మాజీ ఎంపీపీ పాలవలస గౌరీపార్వతి, వైఎస్సార్‌సీపీ నాయకులు, టీడీపీ నాయకులు, సీపీఐ, సీపీఎం నాయకులు, ఆర్టీసీ యూనియన్, రెల్లి సంఘం, దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పెద్ద ఎత్తున హాజరై నివాళుర్పించారు. అలాగే గురుజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు దొర పార్థివ దేహంపై పూలమాల వేసి, ప్రగాఢ సంతాపం తెలిపారు.

శోక సంద్రంలో ఎమ్మెల్యే కుటుంబం..
వీరఘట్టం: తమ గ్రామంతో పాటు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తండ్రి నరసింహరావు దొర చనిపోయారనే వార్త తెలియడంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన సతీమణి శాంతకుమారి, తమ్ముడు లక్ష్మీనారాయణదొర, చిన్న అల్లుడు మండంగి హరిప్రసాద్, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఆయనతో తమకు ఉన్న పరిచయాలను, గత అనుభవాలను గుర్తుచేసుకుని విషణ్న వదనాలతో కన్నీటి పర్యాంతమయ్యారు.

ఫోన్లో ప్రముఖుల పరామర్శ..
ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి పితృ వియోగం జరిగిందని తెలియడంతో ఉత్తరాంధ్రా జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులు ఆమెకు ఫోన్‌ చేసి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, అరుకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి దంపతులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఫోన్‌లో తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement