కోటకు బీటలు
కాంట్రాక్టర్ నిర్వాకంతో నిలిచిపోయిన పనులు
ధర పెంచాలని పదేపదే అదే నిర్వాకం
టీడీపీ మనిషి కావడంతో చర్యలు శూన్యం
గత టీడీపీ హయాంలోనూ అదే పరిస్థితి
వైఎస్ హయాంలో నిధుల వరద.. పనులు చకచకా
అనంతరం పరిస్థితి మళ్లీ మొదటికి..
కొండలా పెరుగుతున్న అంచనా వ్యయం
శిథిలమవుతున్న నిర్మాణాలు, యంత్రాలు
కొండల మధ్య సహజసిద్ధంగా ఊరుతున్న జలాన్ని ఒడిసిపట్టి బంధిస్తే.. బీడు భూములు జలకళ సంతరించుకుంటాయన్నది దశాబ్దాలుగా రైతులు కంటున్న కల. దాన్ని సాకారం చేయడానికి రూపుదిద్దుకున్నదే జంపరకోట జలాశయం ప్రతిపాదన. 1988లోనే శంకుస్థాపన రాయి పడిన ఈ ప్రాజెక్టుకు దివంగత వై.ఎస్. హయాంలో మంచిరోజులు వచ్చాయి. నిధులు పారాయి.. పనులు చకచకా సాగాయి. ఆయన తదనంతరం ప్రాజెక్టు కథ మళ్లీ మొదటికొచ్చింది. రేట్లు పెంచాలంటూ కాంట్రాక్టర్ మొండికేయడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి కాంగ్రెస్, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల ఉదాసీనత నిర్మాణం పూర్తి కాకుండానే జంపరకోటను శిథిల స్థితికి తీసుకొచ్చింది. రైతులకు తీరని వ్యథ మిగిల్చింది.
పాలకొండ:జంపరకోట రిజర్వాయర్ కోసం దశాబ్దాల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పాలకొండ మండల శివారు ప్రాంత రైతులకు ప్రభుత్వాల వైఖరి నిరాశ కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోగా.. ఉన్న కట్టడాలతోపాటు యంత్రాలు శిథిలమవుతున్నాయి.
1988లో శంకుస్థాపన
పాలకొండ మండల శివారు ప్రాంతంలో కొండల మధ్య సహజసిద్ధమైన ఊట జలం పుష్కలంగా లభిస్తోంది. వృథాగా పోతున్న ఆ ఊట జలానికి అడ్డుకట్ట వేసి కొండల మధ్య రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే సాగునీటికి నోచుకోక బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. జంపరకోట గ్రామం వద్ద అడ్డుకట్ట వేసి 2,700 ఎకరాలకు నీరందించాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అదే జంపరకోట జలాశయం. పరిపాలన అనుమతులు కూడా లభించడంతో ఈ ప్రాజెక్టుకు 1988లో శంకుస్థాపన రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు రకరకాల అవాంతరాలతో ఆగుతూ.. సాగుతూ.. దశాబ్దాల తరబడి కొనసాగుతూ.. గత కొన్నేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. మొదట్లో దీనికి రూ. 2 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అయితే జాప్యం కారణంగా అంచనా వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూ ప్రస్తుతం రూ.50 కోట్లకు చేరుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అనుచరుడే కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన అర్ధంతరంగా పనులు నిలిపివేసినా.. అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
వైఎస్ చొరవతో చకచకా..
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో 2006-07లో ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులు అవస్థలను కళ్లారా చూశారు..విన్నారు. జంపరకోట సమీపంలోని ఎం.సింగుపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రైతుల గోడు విని యుద్ధప్రాతిపదికన జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ జలయజ్ఞంలో దీనికి చోటు కల్పించి రూ.15 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. భూములు కోల్పోయిన గిరిజనులు పరిహారం కోసం అడ్డుతగలడంతో మళ్లీ వైఎస్సే చొరవ తీసుకొని రూ.30 లక్షల పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయించి, అడ్డంకులు తొలగించారు. దాంతో ఇక నిర్మాణం పూర్తి అవుతుందని, తమ భూములు జలకళ సంతరించుకుంటాయని ఆశించిన రైతులకు ఊహించని శరాఘాతం తగిలింది. వైఎస్ హఠాన్మరణం, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. అదే సమయంలో కాంట్రాక్టర్ మరోమారు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ పనులు నిలిపివేశారు.
పట్టించుకోని టీడీపీ సర్కారు
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రైతుల అవసరాన్ని గమనించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జంపరకోట నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచాయి. అయినా చంద్రబాబు హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. బడ్జెట్‌లో చోటు కల్పించకపోగా ప్రాజెక్టుకు సంబంధించి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం రైతులను అసంతృప్తికి గురి చేసింది. మరోవైపు జంపరకోట చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు ఏటా సాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పంట చివరి దశలో నీరందక ఎండిపోతుండడంతో అప్పుల పాలవుతున్నారు. కొండల నుంచి వచ్చే నీరు కళ్ల ముందే వృథాగా పోతున్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.
కాంట్రాక్టరే అడ్డంకి
మాటిమాటికీ పనులు నిలిచిపోవడానికి కాంట్రాక్టరే కారణంగా నిలుస్తున్నా.. అతగాడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకునేవారు లేరు. మూడు వైపులా కొండ ఉన్నందున మిగిలిన ఒకవపు తాత్కాలికంగా గట్టు వేసినా రైతుల కష్టాలు తీరుతాయన్న విషయాన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. గట్టును పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో దానితోపాటు ఇప్పటివరకు జరిగిన పనులు, యంత్రాలు శిథిలమవుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి ఇతరత్రా ఎలాంటి అడ్డంకులు లేవు. కాంట్రాక్టర్‌ను బాధ్యుడిని చేస్తే పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప జంపరకోట నిర్మాణం పూర్తి కాదు.