Jamparakota reservoir
-
జంపరకోట.. తప్పిన మాట
జంపర కోట.. మూడు దశాబ్దాలుగా పాలకొండ ప్రాంత రైతులను ఊరిస్తున్న జలాశయం. ఎన్నికల హామీకి తప్పా.. ఆచరణకు నోచుకోని ఓ ప్రాజెక్టు. నిధుల ఖర్చు తప్పితే ఇప్పటికీ ఎకరా పొలానికి కూడా చుక్కనీరు అందించని దుస్థితి. రూ. రెండు కోట్లు అంచనాల నుంచి 20 కోట్ల రూపాయల అంచనాలకు పెరిగిన ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే చందంగా మారాయి. ఇప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలింది. శ్రీకాకుళం, పాలకొండ/ పాలకొండరూరల్: జంపరకోట గ్రామం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కొండల మధ్య రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని 1987లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మూడువైపులా కొండలు ఉండడంతో ఈ మధ్య నుంచి పుష్కలంగా ఊట నీరు ప్రవహిస్తుంది. ఒక్క వైపు గట్టును పూర్తి చేస్తే సుమారుగా 2100 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందుకోసం అప్పట్లో రూ. 2 కోట్లు అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టారు. అప్పటిముఖ్య మంత్రి ఎన్టీఆర్ జలాశయం పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ నాయకులే కాంట్రాక్ట్ బాధ్యతలు తీసుకున్నారు. 30 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ తరువాత పనులు నిలిపివేశారు. నిర్వాసిత గిరిజనులకు పరిహారం అం దించకపోవడంతో తరచూ పనులు నిలివేయాల్సి వచ్చింది. మూడు సంవత్సరాల తరువాత కొత్త ధరలతో ప్రభుత్వానికి విన్నవించుకున్న కాంట్రా క్టర్ పనులు ప్రారంభించారు. మరో 10 శాతం పనులు పూర్తి చేసి మళ్లీ పనులు నిలిపివేశారు. వైఎస్ చొరవతో... 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రిజర్వాయర్ పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయనకు ఇక్కడి రైతులు తమ గోడు వినిపించా రు. దీంతో ఆయన తక్షణం రిజర్వాయర్ అంచనాలు తయారు చేయాలని నీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రిజర్వాయర్‌లోని లోపాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ రిజర్వాయర్‌తో జంపరకోట గ్రామంలోని 39 గిరి జన కుటుంబాలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించా రు. వీరికి పరిహారం అందించలేదని, అలాగే కాలువల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయలేదని తేలింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇందుకు సంబంధించిన అధికారులను హైదరాబాద్ çపిలిపించి మరీ అంచనాలు వేయిం చారు. నిర్వాసితులకు పరిహారం అందించడంతో పాటు వారికి నిర్వాసిత కాలనీ నిర్మించారు. కాలువలకు భూసేకరణ పూర్తి చేశారు. గిరిజన నిర్వాసితుల కోరికపై వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో పరిహారం 60 లక్షలు అందించారు. రైతులకు పరిహారం చెల్లించి ఎడమ, కుడి కాలువల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు పరిహరంగా సుమారు 100 ఎకరాల భూమిని అప్పగించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం ఉన్న అడ్డంకులు తొలగించిన ఆయన కొత్తగా అంచనాలు వేసి రూ. 15 కోట్లు నిధులు మం జూరు చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభం కావడంతో రైతుల్లో ఆశలు చిగురించారు. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఆయన అకాల మరణం రిజర్వాయర్ నిర్మాణంపై కూడా పడింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేశారు. పొర్లు కట్ట నిర్మాణం, కాలువల క్లీయరెన్స్, ఎర్తు బండ్ నిర్మాణం పూర్తి చేసిన తరువాత రెండు వైపుల నుంచి ఎర్తు బండ్‌ను కలపకుండా వదిలివేశారు. దీంతో చేసిన పనులు కూడా శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల హమీ.. జంపçరకోట రిజర్వాయర్‌ను టీడీపీ ఎన్నికల హమీగా వాడుకుంటుంది. గత ఎన్నికల ముందు ఆ పార్టీ నాయకులు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత కనీసం పట్టించుకోలేదు. పనులు పూర్తి చేయాలని రైతులు, రైతు సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తి చేయకపోతే ఎన్నికల ముందు గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరికలు సైతం చేశారు. అధికార పార్టీ నాయకులను ఎక్కడికక్కడే ప్రజలు నిలదీయడంతో మంత్రులు తమ గోడు ముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీకి నష్టం తెస్తాయని వివరించడంతో మరో ఎత్తుగడ ముఖ్యమంత్రి వేశారు. ఇంజినీంగ్ అధికారులకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. దీంతో రూ. 20 కోట్లుతో కొత్తగా అంచనాలు తయారు చేశారు. దీంతో ఈ ఏడాది జూలైలో రూ 17.83 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం జీవో 509 విడుదల చేసి పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ జీవో భూటకపు జీవోగా అధికారులే చెబుతున్నారు. కేవలం పరిపాలన ఆమోదంతో ప్రయోజనం లేదంటున్నారు. ఎన్నికల వరకూ రైతులను మభ్యపెట్టేందుకే ఈ జీవోను ఇచ్చారని రైతులు మండిపడుతున్నారు. పోరాటం ఆగదు ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం. ఎన్నికల హామీ తీర్చాలని ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులను కలసి విన్నవించాం. అధికార పార్టీ నాయకుల పోరాటాలకు కలసి రాకపోతే వారికి గ్రామాల్లో తిరగనీయమని స్పష్టం చేశాం. దీంతో జీవో విడుదల చేశారు. ఇది ఎంతవరకూ అమలు చేస్తారో చూస్తాం. లేకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు.. – బుడితి అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
తెరపైకి జంపరకోట
అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావనతో కదలిక కొత్త అంచనాలతో పనులకు ఏర్పాట్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఎమ్మెల్యేకు లేఖ పాలకొండ: జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. రెండు దశాబ్దాలకుపైగా ఆగుతూసాగుతున్న ఈ రిజర్వాయర్ నిర్మాణంపై కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వాయర్ నిర్మాణ అవసరాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనికిస్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ తీసుకున్న చర్యలపై అమెకు లేఖ పంపించారు. 1987లో రూ. 2.5 కోట్లతో ప్రతిపాదనలు మండలంలోని జంపరకోట గ్రామం వద్ద పెద్దగెడ్డపై 2100 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రిజర్వాయరు నిర్మాణానికి 1987లో ప్రతిపాదించారు. హైదరాబాద్‌కు చెందిన దీపికా కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించారు. రూ. 2.5 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. అప్పట్లో నిర్వాసితుల అడ్డంకులతో పనులు నిలిచిపోయాయి. సకాలంలో నిర్మాణం జరగకపోవడంతో ధరలు భారీగా పెరిగాయని, కొత్త రేట్లకు అనుమతిస్తేనే పనులు చేపట్టగలమయని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. అనంతరం పలు మార్లు కొత్త అంచనాలతో పనులు ప్రారంభమైనా ముందుకు సాగలేదు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. రైతులు మొరపెట్టుకోవడంతో కొత్త అంచనాలు తయారు చేసి రూ.17 కోట్లతో పనులు జరిపించడానికి నిధులు కేటాయించారు. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందటంతో రిజర్వాయరు నిర్మాణం మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికే ఆయన దీని పరిధిలో ఉన్న 45 మంది నిర్వాసిత కుటుంబాలకు ఆర్ ఆర్ ప్యాకేజీని అందించారు. అయినా కాంట్రాక్టరు పనులు సకాలంలో పూర్తి చేయలేదు. వైయస్ మృతితో ప్రాజెక్టు ప్రస్తావన మరుగున పడింది. అసెంబ్లీలో ప్రస్తావన స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. అర్ధంతరంగా నిలిచిపోవడానికి కారణాలను, ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యతకను సభ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిపారుదల శాఖ విభాగం దీనిపై అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో కొత్త ధరలతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. గతంలో పనులు నిలిపిన కాంట్రాక్టర్‌ను దీనిపై వివరణ కోరడంతో 2014-15 ధరలు ప్రకారం బిల్లులు చెల్లిస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన అంగీకరించినట్లు అధికారులు నివేదించారు. ఈ నివేదిక సారాంశాన్ని ప్రిన్సిపాల్ సెక్రెటరీ నుంచి ఎమ్మెల్యేకు లిఖితపూర్వక లేఖ అందింది. 2016 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్లు తెలిపారు. భారీగా పెరిగిన వ్యయం ప్రారంభంలో రూ.2.5 కోట్లు వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టు దశలగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే దీనిపై రూ.7 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరో పది కోట్లు విలువ చేసే పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధరల్లో ఈ పనులు రూ.25 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా ఇందు కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం, సిబ్బంది జీతభత్యాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా సకాలంలో పనులు జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కళావతి కోరుతున్నారు. -
కోటకు బీటలు
కాంట్రాక్టర్ నిర్వాకంతో నిలిచిపోయిన పనులు ధర పెంచాలని పదేపదే అదే నిర్వాకం టీడీపీ మనిషి కావడంతో చర్యలు శూన్యం గత టీడీపీ హయాంలోనూ అదే పరిస్థితి వైఎస్ హయాంలో నిధుల వరద.. పనులు చకచకా అనంతరం పరిస్థితి మళ్లీ మొదటికి.. కొండలా పెరుగుతున్న అంచనా వ్యయం శిథిలమవుతున్న నిర్మాణాలు, యంత్రాలు కొండల మధ్య సహజసిద్ధంగా ఊరుతున్న జలాన్ని ఒడిసిపట్టి బంధిస్తే.. బీడు భూములు జలకళ సంతరించుకుంటాయన్నది దశాబ్దాలుగా రైతులు కంటున్న కల. దాన్ని సాకారం చేయడానికి రూపుదిద్దుకున్నదే జంపరకోట జలాశయం ప్రతిపాదన. 1988లోనే శంకుస్థాపన రాయి పడిన ఈ ప్రాజెక్టుకు దివంగత వై.ఎస్. హయాంలో మంచిరోజులు వచ్చాయి. నిధులు పారాయి.. పనులు చకచకా సాగాయి. ఆయన తదనంతరం ప్రాజెక్టు కథ మళ్లీ మొదటికొచ్చింది. రేట్లు పెంచాలంటూ కాంట్రాక్టర్ మొండికేయడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి కాంగ్రెస్, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల ఉదాసీనత నిర్మాణం పూర్తి కాకుండానే జంపరకోటను శిథిల స్థితికి తీసుకొచ్చింది. రైతులకు తీరని వ్యథ మిగిల్చింది. పాలకొండ:జంపరకోట రిజర్వాయర్ కోసం దశాబ్దాల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పాలకొండ మండల శివారు ప్రాంత రైతులకు ప్రభుత్వాల వైఖరి నిరాశ కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోగా.. ఉన్న కట్టడాలతోపాటు యంత్రాలు శిథిలమవుతున్నాయి. 1988లో శంకుస్థాపన పాలకొండ మండల శివారు ప్రాంతంలో కొండల మధ్య సహజసిద్ధమైన ఊట జలం పుష్కలంగా లభిస్తోంది. వృథాగా పోతున్న ఆ ఊట జలానికి అడ్డుకట్ట వేసి కొండల మధ్య రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే సాగునీటికి నోచుకోక బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. జంపరకోట గ్రామం వద్ద అడ్డుకట్ట వేసి 2,700 ఎకరాలకు నీరందించాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అదే జంపరకోట జలాశయం. పరిపాలన అనుమతులు కూడా లభించడంతో ఈ ప్రాజెక్టుకు 1988లో శంకుస్థాపన రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు రకరకాల అవాంతరాలతో ఆగుతూ.. సాగుతూ.. దశాబ్దాల తరబడి కొనసాగుతూ.. గత కొన్నేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. మొదట్లో దీనికి రూ. 2 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అయితే జాప్యం కారణంగా అంచనా వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూ ప్రస్తుతం రూ.50 కోట్లకు చేరుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అనుచరుడే కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన అర్ధంతరంగా పనులు నిలిపివేసినా.. అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. వైఎస్ చొరవతో చకచకా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో 2006-07లో ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులు అవస్థలను కళ్లారా చూశారు..విన్నారు. జంపరకోట సమీపంలోని ఎం.సింగుపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రైతుల గోడు విని యుద్ధప్రాతిపదికన జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ జలయజ్ఞంలో దీనికి చోటు కల్పించి రూ.15 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. భూములు కోల్పోయిన గిరిజనులు పరిహారం కోసం అడ్డుతగలడంతో మళ్లీ వైఎస్సే చొరవ తీసుకొని రూ.30 లక్షల పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయించి, అడ్డంకులు తొలగించారు. దాంతో ఇక నిర్మాణం పూర్తి అవుతుందని, తమ భూములు జలకళ సంతరించుకుంటాయని ఆశించిన రైతులకు ఊహించని శరాఘాతం తగిలింది. వైఎస్ హఠాన్మరణం, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. అదే సమయంలో కాంట్రాక్టర్ మరోమారు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ పనులు నిలిపివేశారు. పట్టించుకోని టీడీపీ సర్కారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రైతుల అవసరాన్ని గమనించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జంపరకోట నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచాయి. అయినా చంద్రబాబు హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. బడ్జెట్లో చోటు కల్పించకపోగా ప్రాజెక్టుకు సంబంధించి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం రైతులను అసంతృప్తికి గురి చేసింది. మరోవైపు జంపరకోట చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు ఏటా సాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పంట చివరి దశలో నీరందక ఎండిపోతుండడంతో అప్పుల పాలవుతున్నారు. కొండల నుంచి వచ్చే నీరు కళ్ల ముందే వృథాగా పోతున్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కాంట్రాక్టరే అడ్డంకి మాటిమాటికీ పనులు నిలిచిపోవడానికి కాంట్రాక్టరే కారణంగా నిలుస్తున్నా.. అతగాడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకునేవారు లేరు. మూడు వైపులా కొండ ఉన్నందున మిగిలిన ఒకవపు తాత్కాలికంగా గట్టు వేసినా రైతుల కష్టాలు తీరుతాయన్న విషయాన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. గట్టును పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో దానితోపాటు ఇప్పటివరకు జరిగిన పనులు, యంత్రాలు శిథిలమవుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి ఇతరత్రా ఎలాంటి అడ్డంకులు లేవు. కాంట్రాక్టర్‌ను బాధ్యుడిని చేస్తే పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప జంపరకోట నిర్మాణం పూర్తి కాదు.