జంపరకోట.. తప్పిన మాట | jamparakota Project Delayed In Srikakulam | Sakshi
Sakshi News home page

జంపరకోట.. తప్పిన మాట

Published Thu, Oct 4 2018 8:49 AM | Last Updated on Thu, Oct 4 2018 8:49 AM

jamparakota Project Delayed In Srikakulam - Sakshi

పనులు నిలిచిపోయిన జంపరకోట ఇదే

జంపర కోట.. మూడు దశాబ్దాలుగా పాలకొండ ప్రాంత రైతులను ఊరిస్తున్న జలాశయం. ఎన్నికల హామీకి తప్పా.. ఆచరణకు నోచుకోని ఓ ప్రాజెక్టు. నిధుల ఖర్చు తప్పితే ఇప్పటికీ ఎకరా పొలానికి కూడా చుక్కనీరు అందించని దుస్థితి. రూ. రెండు కోట్లు అంచనాల నుంచి 20 కోట్ల రూపాయల అంచనాలకు పెరిగిన ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే చందంగా మారాయి. ఇప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలింది.

శ్రీకాకుళం, పాలకొండ/ పాలకొండరూరల్‌: జంపరకోట గ్రామం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కొండల మధ్య రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని 1987లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మూడువైపులా కొండలు ఉండడంతో ఈ మధ్య నుంచి   పుష్కలంగా ఊట నీరు ప్రవహిస్తుంది. ఒక్క వైపు గట్టును పూర్తి చేస్తే సుమారుగా 2100 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందుకోసం అప్పట్లో రూ. 2 కోట్లు అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టారు. అప్పటిముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ జలాశయం పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ నాయకులే కాంట్రాక్ట్‌ బాధ్యతలు తీసుకున్నారు. 30 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ తరువాత పనులు నిలిపివేశారు. నిర్వాసిత గిరిజనులకు  పరిహారం అం దించకపోవడంతో తరచూ పనులు నిలివేయాల్సి వచ్చింది. మూడు సంవత్సరాల తరువాత కొత్త ధరలతో  ప్రభుత్వానికి విన్నవించుకున్న కాంట్రా క్టర్‌ పనులు ప్రారంభించారు. మరో 10 శాతం పనులు పూర్తి చేసి మళ్లీ పనులు నిలిపివేశారు.

వైఎస్‌ చొరవతో...
2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చొరవతో రిజర్వాయర్‌ పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయనకు ఇక్కడి రైతులు తమ గోడు వినిపించా రు. దీంతో ఆయన తక్షణం రిజర్వాయర్‌ అంచనాలు తయారు చేయాలని నీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రిజర్వాయర్‌లోని లోపాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ రిజర్వాయర్‌తో జంపరకోట గ్రామంలోని 39 గిరి జన  కుటుంబాలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించా రు. వీరికి పరిహారం అందించలేదని, అలాగే కాలువల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయలేదని తేలింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఇందుకు సంబంధించిన అధికారులను హైదరాబాద్‌ çపిలిపించి మరీ అంచనాలు వేయిం చారు. నిర్వాసితులకు పరిహారం అందించడంతో పాటు వారికి నిర్వాసిత కాలనీ నిర్మించారు. కాలువలకు భూసేకరణ పూర్తి చేశారు. గిరిజన నిర్వాసితుల కోరికపై వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో పరిహారం 60 లక్షలు అందించారు. రైతులకు పరిహారం చెల్లించి ఎడమ, కుడి కాలువల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు పరిహరంగా సుమారు 100 ఎకరాల భూమిని అప్పగించారు. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఉన్న అడ్డంకులు తొలగించిన ఆయన కొత్తగా అంచనాలు వేసి రూ. 15 కోట్లు నిధులు మం జూరు చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభం కావడంతో రైతుల్లో ఆశలు చిగురించారు. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఆయన అకాల మరణం రిజర్వాయర్‌ నిర్మాణంపై కూడా పడింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేశారు. పొర్లు కట్ట నిర్మాణం, కాలువల క్లీయరెన్స్, ఎర్తు బండ్‌ నిర్మాణం పూర్తి చేసిన తరువాత రెండు వైపుల నుంచి ఎర్తు బండ్‌ను కలపకుండా వదిలివేశారు. దీంతో చేసిన పనులు కూడా శిథిలావస్థకు చేరాయి.

ఎన్నికల హమీ..
జంపçరకోట రిజర్వాయర్‌ను టీడీపీ ఎన్నికల హమీగా వాడుకుంటుంది. గత ఎన్నికల ముందు ఆ పార్టీ నాయకులు రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత కనీసం పట్టించుకోలేదు. పనులు పూర్తి చేయాలని రైతులు, రైతు సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. రిజర్వాయర్‌ పూర్తి చేయకపోతే ఎన్నికల ముందు గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరికలు సైతం చేశారు. అధికార పార్టీ నాయకులను ఎక్కడికక్కడే ప్రజలు నిలదీయడంతో మంత్రులు తమ గోడు ముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీకి నష్టం తెస్తాయని వివరించడంతో మరో ఎత్తుగడ ముఖ్యమంత్రి వేశారు. ఇంజినీంగ్‌ అధికారులకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. దీంతో రూ. 20 కోట్లుతో కొత్తగా అంచనాలు తయారు చేశారు. దీంతో ఈ ఏడాది జూలైలో రూ 17.83 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం జీవో 509 విడుదల చేసి పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ జీవో భూటకపు జీవోగా అధికారులే చెబుతున్నారు. కేవలం పరిపాలన ఆమోదంతో ప్రయోజనం లేదంటున్నారు. ఎన్నికల వరకూ రైతులను మభ్యపెట్టేందుకే ఈ జీవోను ఇచ్చారని రైతులు మండిపడుతున్నారు.

పోరాటం ఆగదు
ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నాం. ఎన్నికల హామీ తీర్చాలని ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులను కలసి విన్నవించాం. అధికార పార్టీ నాయకుల పోరాటాలకు కలసి రాకపోతే వారికి గ్రామాల్లో తిరగనీయమని స్పష్టం చేశాం. దీంతో జీవో విడుదల చేశారు. ఇది ఎంతవరకూ అమలు చేస్తారో చూస్తాం. లేకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు..
– బుడితి అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement