సాక్షి, అనంతపురం: అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
కాంట్రాక్టర్ నరసింహారెడ్డి మద్యం మత్తులో సోమవారం నగరపాలక సంస్థలో నానా హంగామా చేశాడు. స్వీపింగ్ మిషన్ సెకండ్ పేమెంట్ బిల్లుకు సంబంధించి సంతకం చేయాలని ఏఈ మహదేవ ప్రసాద్‌కు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి అల్టిమేటం జారీ చేశాడు. అందుకు ఏఈ మహదేవప్రసాద్ నిరాకరించడంతో నీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప వారిని వారించారు. చివరకు కాంట్రాక్టర్‌ను అతనితో వచ్చిన ఇద్దరు పోకిరీలను అక్కడి నుంచి అధికారులు పంపిచేశారు.
దారికాచి దాడి
కాంట్రాక్టర్... డీఈ కిష్టప్పపై దారికాచి దాడి చేశాడు. డీఈ కిష్టప్ప.. కార్పొరేటర్ పద్మావతి సంతాప సభ అయ్యాక ఇంటికి బయలుదేరారు. డీఈని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి తన అనుచరులతో కారులో ఫాలో చేస్తూ వచ్చారు. నగరంలోని నామా టవర్స్ సమీపంలోకి రాగానే డీఈ టూవీలర్ వాహనాన్ని కారుతో తగిలించి వెళ్లిపోయారు. డీఈ తేరుకునే లోపే కాంట్రాక్టర్ జారుకున్నాడు. డీఈ... కాంట్రాక్టర్ కారును ఫాలో చేశారు. రఘువీరా కాంప్లెక్స్ వెనుకవైపు వీధిలోకి వెళ్లగా... అక్కడ కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని డీఈ కిష్టప్ప నిలదీశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నరసింహారెడ్డి డీఈ కిష్టప్పపై బూటుకాలితో దాడి చేశాడు.
వన్‌టౌన్‌లో ఫిర్యాదు
డీఈపై దాడి చేయడాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్‌ఈ నాగమోహన్ డీఈలు షుకూర్, నరసింహారెడ్డి, ఏఈ మహదేవప్రసాద్ కాంట్రాక్టర్‌పై వన్‌టౌన్ ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ డీఈకు మద్దతుగా వచ్చారు.
(పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న డీఈ కిష్టప్ప, ఏఈ మహదేవప్రసాద్, వైఎస్సార్ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ)
ఆది నుంచి వివాదమే..!
స్వీపింగ్ మిషన్ కొనుగోలు ఆది నుంచి వివాదాస్పదంగా మారింది. 2015లో అప్పటి కమిషనర్ రూ. 33 లక్షలతో స్వీపింగ్ మిషన్‌ను కొనుగోలు చేశారు. అనంతపురం రోడ్లపై స్వీపింగ్ మిషన్ పని చేయదని అన్ని వర్గాల నుంచి పూర్తీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. 2016లో కమి షనర్‌గా ఉన్న సురేంద్రబాబు స్వీపింగ్ మిషన్‌ను వ్యతిరేకించారు. అది అసెంబుల్ సెట్ అని, జేఎన్‌టీయూ అధికారులతో సర్టిఫై చేశాకే బిల్లు చేస్తామని తేల్చి చెప్పారు. స్వీపింగ్ మిషన్ సరిగా లేకపోవడంతో వెనక్కు పంపామని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పలుమార్లు చెప్పారు. స్వీపింగ్ మిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, మేయర్ ఇప్పుడు మొదటి పేమెంట్ కింద కాంట్రాక్టర్‌కు రూ.24 లక్షలు చెల్లిస్తే మిన్నకుండిపోయారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వీపింగ్ మిషన్ మెయిన్‌టైనెన్స్ నెలకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. ప్రతి నెలా రూ లక్షల్లో ప్రజాధనం లూటీ అవుతుందని సాక్షాత్తు పలువురు అధికారులే వాపోతున్నారు.
పోలీసుల అదుపులో కాంట్రాక్టర్
నగర పాలక సంస్థ డీఈ కిష్టప్పపై దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని వన్‌టౌన్‌న్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. డీఈతో పాటు మేయర్ స్వరూప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడికి పాల్పడిన కాంట్రాక్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జీ సీఐ కృష్ణమోహన్‌ను కలిసి డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment