వైకుంఠపాళి ఆటలో ఎక్కడ.. ఎప్పుడు.. ఏ దశలో పాము నోట్లో పడతారో ఆ ఆట ఆడేవారికే తెలియదు. పాములను తప్పించుకుంటూ పరమపదసోపానం అగ్రభాగానికి
వైకుంఠపాళి ఆటలో ఎక్కడ.. ఎప్పుడు.. ఏ దశలో పాము నోట్లో పడతారో ఆ ఆట ఆడేవారికే తెలియదు. పాములను తప్పించుకుంటూ పరమపదసోపానం అగ్రభాగానికి చేరుకోవడానికి అలుపెరగక శ్రమించాలి. రాజకీయమనే వైకుంఠపాళిలో నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతకు తావే లేదని తమ చేతలతో చెబుతుంటారు కొందరు రాజకీయ నాయకులు. తమనెన్నుకున్న ప్రజలు విస్తుపోతారని తెలిసినా అధికార యావ కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. పక్క డివిజన్ కార్పొరేటర్ల భర్తలూ సంఘ సేవకుల జాబితాలో...ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రతిపాదించిన జాబితాలో ఇంకా పలు చిత్ర విచిత్రాలున్నాయి. ఏడో డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ భర్త గోపాల్ పేరు 8వ డివిజన్ కమిటీలో సంఘ సేవకునిగా దర్శనమిచ్చింది. ఇక 12వ డివిజన్ కార్పొరేటర్ రంగాచారి అయితే.. అదే డివిజన్ కమిటీలో ఆయన సోదరుడు కృష్ణమాచారి ఉన్నారు. 41వ డివిజన్ కార్పొరేటర్ బంగారమ్మ కాగా.. ఆమె కుమారుడు వెంకటేశ్, 30వ డివిజన్ కార్పొరేటర్ హేమలత కాగా.. ఈమె భర్త శేఖర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బిందుప్రియ కాగా.. ఈమె భర్త శేఖర్‌బాబు అవే డివిజన్ల కమిటీల్లో ‘సంఘ సేవకుల’ జాబితాలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందేందుకైనా భార్యాభర్తలను ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. చివరకు భార్యాభర్తలు వృద్ధాప్య పింఛన్‌కు అర్హులైనా ఒక్కరికి మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే.. పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కమిటీలో మాత్రం భార్య కార్పొరేటర్ హోదాలో, భర్త ‘సంఘ సేవకుని’ హోదాలో ప్రతిపాదించడంలోని ఔచిత్యం ఏమిటో ఎమ్మెల్యేనే తెలపాలి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం :
పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కమిటీల నియామకంలో తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ‘పేనుకు పెత్తనం ఇస్తే..’ అన్న సామెతను తలపిస్తోంది. ఈ కమిటీల్లో స్థానిక ప్రజాప్రతినిధికి తోడు ఇద్దరు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ప్రతినిధులు, ఇద్దరు సంఘ సేవకులు ఉండాలని, వారి నియామకం అధికార పార్టీ నేతలు, జిల్లా మంత్రులు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టడం ‘పచ్చచొక్కాల’కు పట్టపగ్గాల్లేకుండా చేస్తోంది. ఈ వెసులుబాటును వినియోగించుకుని రౌడీషీటర్లను, నేరచరితులను కూడా ‘సంఘ సేవకుల’ జాబితాలో చేర్చేస్తున్నారు.