ఇస్లామాబాద్: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్‌కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే.
పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నహిద్ ముబారక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు.
ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, 14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.
ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్‌ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్ను ఎక్కడ పారేశాడో తెలియలేదు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్ పత్రిక డాన్ ప్రకారం.. ఆన్లైన్ పబ్జీ గేమ్ సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే గేమింగ్ డిజార్డర్‌ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment