
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఈ పదవిని ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. కాలవను మంత్రివర్గంలోకి తీసుకున్న సమయంలో ఉద్వాసనకు గురైన పల్లెకు ఆ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వెంటనే దాన్ని అమలు చేయకపోవడంతో ఇప్పటి వరకు కాలవ ఆ పదవిని నిర్వహించారు. తాజాగా ఈ పదవిని భర్తీ చేయాలని నిర్ణయించి పల్లె, బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు పేర్లను పరిశీలించారు.
చివరకు పల్లె పేరునే ఖరారు చేశారు. మరోవైపు శాసన మండలిలో చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమించాలని నిర్ణయించారు. ఈ పదవి కోసం టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్రప్రసాద్, రామసుబ్బారెడ్డి పేర్లు వినిపించినా చంద్రబాబు పయ్యావుల వైపే మొగ్గు చూపారు. శనివారం పయ్యావుల, పల్లెను తన నివాసానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి వారి పేర్లు ఖరారు చేసిన విషయాన్ని తెలిపినట్లు సమాచారం. మండలిలో మూడు విప్ పదవులను కూడా వెంటనే భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment