పచ్చని పల్లెకు ‘బెల్టు' మత్తు | Palleku green 'belt' drugs | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెకు ‘బెల్టు' మత్తు

Published Fri, Nov 28 2014 3:35 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

పచ్చని పల్లెకు ‘బెల్టు' మత్తు - Sakshi

పచ్చని పల్లెకు ‘బెల్టు' మత్తు

కర్నూలు : మా గ్రామంలో మద్యం బెల్టు దుకాణం కొనసాగుతోంది. ఫిర్యాదు చేస్తేనేమో దాడులకు వచ్చే ముందు సమాచారం ఇచ్చి వస్తున్నారు. అందుకే ఎవరూ దొరకడం లేదు. వారు వచ్చిపోయాక పరిస్థితి షరా మామూలే అవుతోంది. ఇది.. రెండు వారాల క్రితం ఎక్సైజ్ అధికారులకు కర్నూలు మండలంలోని రెండు గ్రామాల వాసులు చేసిన ఫిర్యాదు.

 మద్యం బెల్టు దుకాణం వల్ల మా వూర్లో సంసారాలు నాశనం అవుతున్నాయి. యుక్త వయస్సులో ఉన్న మా బిడ్డలు మద్యానికి అలవాటు పడి ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు. బెల్టు దుకాణాన్ని వెంటనే గ్రామం నుంచి తొలగించండి. ఆదోని మండలం కుప్పగల్లు గ్రామ వాసులు వారం రోజుల క్రితం స్వయంగా ఎస్పీ ఆకే రవికృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు.

 బెల్టు దుకాణం వల్ల మా గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్న విషయానికే వివాదాలు తలెత్తుతున్నాయి. ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఊర్లో బెల్టు దుకాణం లేకుండా చూడండి. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రతి వారం కనీసం మూడు, నాలుగు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చేసిన తొలి ఐదు సంతకాల్లో మద్యం బెల్టు దుకాణాల తొలగింపు ఒకటి. అయితే దీని అమలులో ఎక్సైజ్ శాఖ మౌనం వహిస్తున్నదని జిల్లా అధికారులకు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. మద్యం మహమ్మారి పల్లెల్లో కరాళా నృత్యం చేస్తుందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

జిల్లాలో 194 మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. వాటికి అనుబంధంగా కనీసం రెండు వేలకు పైగా పల్లెల్లో బెల్టు దుకాణాలు వెలిశాయంటే అతిశయోక్తి కాదు. 898 పంచాయతీలు ఉండగా ప్రతి పంచాయతీలో కనీసం ఐదు బెల్టు దుకాణాలతో పాటు నాటుసారా ఏరులై పారుతోంది. కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ స్టేషన్లకు బెల్టు దుకాణాలు, ఎమ్మార్పీ ఉల్లంఘన, నాటుసారా వ్యాపారాలపై రోజుకు కనీసం ఐదు నుంచి పది ఫిర్యాదులు వస్తున్నా మౌనం దాలుస్తున్నారు.

మద్యం వ్యాపారం, బెల్టు దుకాణాల నిర్వహణ వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పగిడ్యాల, ప్రాతకోట, కొణిదెల, అల్లినగరం, పోలకల్లు, కుప్పగల్లు ప్రాంతాల నుంచి ఇటీవల ఎక్సైజ్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపేసుకున్నారు.

అలాగే లద్దగిరి, ప్యాలకుర్తి, ఎల్లార్తి, తగరడోణ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చినప్పటికీ అటు ఎక్సైజ్ అధికారులు కాని, ఇటు సివిల్ పోలీసులు కాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి పల్లెలో అందుబాటులో లభిస్తుండటంతో యువత పనులు మానేసి మద్యానికి బానిసలవుతున్నారు. మద్యం మత్తులో బంధు మిత్రుల మధ్యనే చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు సవాల్ విసురుతోంది. ఇటు ఇంటిని.. అటు ఒంటిని గుల్ల చేస్తుంది.

ఇవేమీ పట్టని వ్యాపారులు మద్యం అమ్మకాలే లక్ష్యంగా ‘ఊళ్లకు బెల్టు’ ఉచ్చును మరింతగా బిగిస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. కర్నాటక సరిహద్దు గ్రామాల్లో వీధివీధిన గ్లాసుల గలగలలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులే నేరుగా తమ కార్యకర్తల ద్వారా బెల్టు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

హాలహర్వి, చిప్పగిరి మండలాల్లో బెల్టు దుకాణాల ద్వారా మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల్లో కర్నాటక మద్యం ఏరులై పారుతోంది. నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులేమో తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తిన చోట్లేమో నామమాత్రంగా దాడులు చేపట్టి అప్పటికి అయ్యిందనిపిస్తున్నారు.

 తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం నిర్వహించి మరీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పోటీ ఎక్కువ కావడంతో గ్రామాభివృద్ధి కోసం ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారే బెల్టు షాపు నిర్వహించుకోవచ్చునన్న ఒప్పందంతో కొన్ని గ్రామాల్లో బెల్టు వ్యాపారం కొనసాగుతోంది.  పల్లెల్లో శాంతి భద్రతల సమస్యలు ముదిరిపోక ముందే ఎక్సైజ్ అధికారులు స్పందించి ముకుతాడు వేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement