సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అల్లకల్లోలం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే టీడీపీ నేతలు డ్రామాలకు దిగుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గురజాలలోని అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేయడంతో చంద్రబాబు, అండ్ కో లొసుగులు బయటకు వస్తాయనే భయంపట్టుకుందని స్థానిక నేతల సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అనేక అక్రమాలకు పాల్పడి.. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలపై తాజా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణను రాజకీయ వేధింపులుగా చూపించే ప్రయత్నం చేయడం కోసం.. వైఎస్సార్‌సీపీ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ కొందరు టీడీపీ నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారు.
బిగుసుకుంటున్న అక్రమ మైనింగ్ ఉచ్చు..
మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేసింది. బ్యాంకు ఖాతాల్లో భారీగా జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల చిట్టాలు ఒక్కొక్కటీ బయటపడతుండటంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. వీటి వెనుక ఉన్న నేతల పునాదులు కదులుతున్నాయి. ఇదిలావుండగా.. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామని, ఆ కష్టాలు పగవారికి కూడా రాకూడదు అంటూ యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట ఇటీవల తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యరపతినేని, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. వారిపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని మంత్రి వాగ్ధానం చేశారు. దీంతో పల్నాడులోని టీడీపీ నేతలు భయాందోళకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ దాడుల పేరిట చంద్రబాబు కొత్త డ్రామాలకు దిగుతున్నారు.
కొంపముంచిన కోడెల..
మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బాగోతం అసెంబ్లీ ఫర్నీచర్ దోపిడీ రూపంలో గుంటూరు జిల్లాలో టీడీపీ పరువు రోడ్డుపాలైంది. జిల్లాలో వ్యాప్తంగా పార్టీ పూర్తిగా పతానావస్థకు చేరడంతో పచ్చ పార్టీల నేతలు అనేక దుశ్చర్యలకు పాల్పడుతూ.. ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగుతున్నారు. తమ అనుకూల మీడియా సహాయంతో ప్రభుత్వ కార్యక్రమాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలావుండగా గత ఐదేళ్లకాలంలో అభివృద్ధికి నోచుకోని పల్నాడు ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో గురజాలలో మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పల్నాడులో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం బృహత్ ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే వీటిని అమలు చేయనుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వరికెశలపూడి ప్రాజెక్టుకు ముందడుగులు పడుతోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment