‘స్థానిక’ సందడి! | Panchayat Elections Processing Speedup In Villages | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ సందడి!

Published Sat, Nov 30 2019 4:59 AM | Last Updated on Sat, Nov 30 2019 4:59 AM

Panchayat Elections Processing Speedup In Villages - Sakshi

ఈసారి మనూరి ప్రెసిడెంట్‌గా వెంకట్రావు పోటీ చేస్తానంటున్నాడట..! ఎంపీటీసీకి పోటీ చేయడానికి ప్రతాప్‌రెడ్డి రెడీ అవుతున్నాడు. వీలైతే మండల ప్రెసిడెంట్‌ కావాలని ప్రయత్నిస్తున్నాడు..!!

సాక్షి, అమరావతి: త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే లక్షన్నరకు పైగా పదవులకు పోటీ జరగనుంది. దాదాపు ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది.

తెరపైకి కొత్త తరం!
రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. యువ సీఎం వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వపరంగా ప్రోత్సాహంఅందిస్తుండటం యువత ముందుకు రావటానికి కారణమని విశ్లేషిస్తున్నారు.

కొత్తవి ఏర్పాటు, విలీనంపై నిషేధం ఎత్తివేత
గ్రామ పంచాయతీలను విడదీసి కొత్తవి ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పంచాయితీలుగా ఉన్న వాటిని రెండు మూడు కలిపి ఒకటిగా విలీనం చేయడంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నిషేధం అమలులో ఉంది. పలుచోట్ల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు నాలుగు రోజుల క్రితం నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. డిసెంబరు 20 నాటికి జిల్లాల నుంచి అందే వినతుల మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనం ప్రక్రియను చేపట్టి ఆ తర్వాత తిరిగి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

డిసెంబర్‌ చివరి వరకే గడువు
2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలు కానున్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా, పట్టణ ప్రాంతాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయదలిస్తే డిసెంబరు నెలాఖరుకే పూర్తి చేయాలని సూచిస్తూ కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.  జనవరి నుంచి ఆయా ప్రాంతాలలో మార్పులు చేర్పులకు తావు ఉండదని అధికారులు చెబుతున్నారు. 

కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ 
గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో పంచాయితీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని చేసేందుకు  సిబ్బందిని తాత్కాలికంగా డిప్యుటేషన్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించుకునేందుకు అనుమతి కోరుతూ కమిషనర్‌ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది.

సిద్ధంగా ఉన్నాం..
రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేసిన వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు పంచాయితీరాజ్‌ శాఖ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తాం.    
– గిరిజాశంకర్‌ (పంచాయితీరాజ్‌ శాఖ కమిషనర్‌)

పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు
- ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా ఉన్న 249 గ్రామాలను పట్టణాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు అధికారులు చెబుతున్నారు. 
78 పంచాయతీలను కొత్తగా 36 నగర పంచాయితీలుగా మార్చే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 
వివిధ పట్టణాలు, నగర పాలక సంస్థలకు చుట్టుపక్కల ఉండే మరో 97 గ్రామాలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇవికాకుండా కలెక్టర్ల వద్ద మరో 74 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.
రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్న చోట్ల వాటిని వేరు చేసి కొత్తవి ఏర్పాటు చేయాలంటూ మరో 60 దాకా ప్రతిపాదనలు అందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement