పంచాయతీ రాజ్ ఉద్యోగుల రక్తదానం
Published Tue, Sep 17 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 50 మంది ఉద్యోగులు రక్తదానం చేసి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజేశారు. కేంద్రం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకె ళ్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గంగాధర్‌గౌడ్, జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీదేవి, ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్, డివిజనల్ పంచాయతీ అధికారి కృష్ణమోహన్, కేఎల్ నరశింహారావు, శరత్, సంఘ చైర్మన్ రాజశేఖర్, కార్యదర్శి శ్యామ్, రెడ్ క్రాస్ డాక్టర్ చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఉద్యోగుల నిరసన
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని, ప్రభుత్వం జీతమివ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక చర్చి సెంటర్‌లో ఉద్యోగులంతా ఎండుగడ్డి తింటూ నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఇప్పటికైనా మారాలన్నారు. వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులతో భారీ మానవహారం
రాష్ట్ర మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పీవీఆర్ స్కూల్ ఆవరణలో విద్యార్థులతో భారీ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు, జిల్లా అధ్యక్షుడు జాలారావు, కార్యదర్శి బ్రహ్మం, కోశాధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Advertisement