
పాండవుల మెట్టపై నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు పాండవులు ఉపయోగించారని చెప్పే గుహ
పెద్దాపురం: ఎంతో పురాతన చరిత్ర కలిగిన పాండవుల మెట్ట క్రమేపీ ప్రాభవం కోల్పోతోంది. మెట్టను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామంటూ అమాత్యులు ఇచ్చే హామీలు నీటి మూటలుగా మిగులుతున్నాయి. మెట్టపై నిర్మించిన సూర్యనారాయణస్వామివారి దేవాలయానికి ఆదివారం వందలాది మంది, నిత్యం సుమారు వంద మంది వరకూ భక్తులు వెళ్తుంటారు. 1960లో మెట్ట విస్తీర్ణం సుమారు 72 ఎకరాలుంటే ప్రస్తుతం అది కేవలం రెండెకరాలకే పరిమితమైంది. మిగిలిన 70 ఎకరాలను ప్రభుత్వమే వివిధ కార్యాలయాలకు కేటాయించింది. పాలకులు మారుతున్నారు గానీ పాండవుల మెట్ట అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పాండవులు వనవాసం సమయంలో ఈ మెట్టపై నివాసమున్నారని, వారు స్నానం చేసేందుకు అతిపెద్ద గుహ మార్గం ద్వారా గోదావరి నదికి వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. ఈ మెట్టపై భీముని పాదాలు, సీతమ్మ వారు పవ ళించిన చాప ఇప్పటికీ మెట్టపై ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఎంతో చరిత్ర ప్రసిద్ధి ఉన్న ఈ మెట్ట అభివృద్ధిపై పర్యాటక శాఖ దృష్టి సారించడం లేదు.
ఆక్రమణల చెరలో...
పెద్దాపురం పట్టణంలో ఎక్కడా ఖాళీ లేనట్టు ప్రభుత్వం ఈ మెట్టపైనే పలు కార్యాలయాలు నిర్మించింది. నవోదయ పాఠశాల, గృహ నిర్మాణ, వ్యవసాయ, మార్కెటింగ్, అగ్నిమాపక తదితర శాఖల భవనాలు నిర్మించారు. వాటి కోసం సుమారు 70 ఎకరాలు కేటాయించారు. ఈ నాలుగేళ్లలో పార్కు, స్టేడియం నిర్మాణమంటూ మెట్టను మరి కాస్త తొలగించారు. పాండవుల మెట్టను పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామంటూ సూర్యనారాయణస్వామి ఆలయానికి కాస్త దూరంలో శతాబ్ది పార్కును ఏర్పాటు చేశారు.
సీసీ రోడ్డుతో సరి
ఇటీవల కొండపైకి వెళ్లేందుకు సుమారు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినా దాని నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లైట్లు అరకొరగా వెలుగుతున్నాయి. రక్షణ గోడల నిర్మాణం హామీ గాల్లో కలిసిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాండవుల మెట్టను పర్యాటక ప్రదేశంగా తీర్చిద్దాలని పలువురు కోరుతున్నారు.
కనుమరుగవనున్న ఆర్డీఓ కార్యాలయం
దాదాపు 111 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కట్టడంగా పిలిచే ఆర్డీఓ కార్యాలయం కనుమరుగు కానుంది. ప్రజా సంఘాల నుంచి ఆర్డీఓ కార్యాలయ భవనాన్ని కూల్చవద్దంటూ వినతులు, ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ఆ పురాతన భవనాన్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. 1907లో నిర్మించిన ఈ భవనం జిల్లాలోనే తొలి సమితిగా సేవలందించింది. 1927లో రెవెన్యూ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఆర్డీవో కార్యాలయంగా 12 మండలాల ప్రజలకు సేవలందిస్తోంది. ఇటీవల నిధులు విడుదల చేసి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భవన కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలని చెబుతున్నప్పటికీ పట్టణ ప్రథమ పౌరుడు పట్టుదలకు పోయి ఈ భవనం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు భవన కూల్చివేతను ఆపి పక్క స్థలంలో భవనం నిర్మిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
చారిత్రక జ్ఞాపకం
పర్యాటక ప్రాంతంగా చెప్పుకునే పాండవుల మెట్టకు ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్న ఆర్డీఓ కార్యాలయ భవనానికి పురాతన చరిత్ర ఉంది. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించడం తగదు. దీన్ని చారిత్రక జ్ఞాపకంగా పదిలపర్చాలి. ఈ భవనం కూల్చివేత నిర్ణయాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ భవనాన్ని కూల్చకూడదు. మెట్ట అభివృద్ధికి పర్యాటక, పురావస్తుశాఖలు కృషి చేయాలి.
– కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment