తోడల్లుడే హంతకుడు
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం
- మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు
తిరుచానూరు : వివాహేతర సంబంధం కారణంగా తోడల్లుడే వరుసకు తమ్ముడిని హత్యచేశాడు. ఈ నెల 16వ తేదీ దామినేడు రా మక్కచెరువులో లభ్యమైన మృతదేహం కేసును తిరుచానూరు పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం తిరుచానూరు పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేం ద్రనాయుడు వివరించారు. సీఐ కథనం మేరకు...కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల గ్రామానికి చెందిన బతుకమ్మ, హనుమంతు దంపతులకు జ్యోతి, సుజాత కుమార్తెలు ఉన్నారు. అదే జిల్లా ఎమ్మిగనూరు మండలం అలువాల గ్రామానికి చెందిన ధర్మరాజుకు పెద్దకుమార్తె జ్యోతిని ఇచ్చి వివాహం చేశారు.
అలాగే రెండో కుమార్తె సుజాతను కర్నూలు జిల్లా సీ.బెళగళ్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన గజేంద్ర(30)కిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం అలుళ్లు ఇద్దరూ అత్తగారింట్లోనే ఉంటున్నారు. హనుమంతు పెద్దల్లుడు ధర్మరాజు ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం తిరుపతి వచ్చి, సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చిన కొన్నాళ్లకు లగేజీ ఆటోను కొనుగోలు చేసి, బాడుగులకు తిప్పుతుండేవాడు. ధర్మరాజు తోడల్లుడు, వరుసకు తమ్ముడైన గజేంద్ర కూడా మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చి చేరి, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల క్రితం తన భార్య సుజాతను తీసుకొచ్చి ఓటేరులో కాపు రం పెట్టాడు. ఈ క్రమంలో ధర్మరాజు తన మరదలైన సుజాతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యం గజేంద్రకు తెలిసింది.
దీంతో భార్య భర్తల మధ్య గొడవ రావడంతో తాళి బొట్టు తీసి, గజేంద్రకు ఇచ్చేసి సాయినగర్‌లోని అక్క ఇంటికి సుజాత వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ ధర్మరాజు, అతని భార్య జ్యోతి, మరద లు సుజాత వారి పిల్లలతో కలిసి లగేజీ ఆటోలో కప్పట్రాళ్లకు వెళ్లారు. 14వ తేదీన వారిని అక్కడ విడిచిపెట్టి ధర్మరాజు ఒక్కడే తిరుపతికి వచ్చాడు. ఎలాగైన గజేంద్రను అంతమొందించాలని పథకం పన్నాడు. దీంతో అదే రోజు రా త్రి సాయినగర్‌లోని ధర్మరాజు ఇంట్లో ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం గొడవ పడ్డారు. దీంతో ధర్మరాజు ఇం ట్లోని చిన్న సిలిండర్‌తో గజేంద్ర నుదిటి పై కొట్టాడు. స్పృహ తప్నిన గజేంద్రను తన ఆటోలో రామక్క చెరువు వద్దకు తీసుకొచ్చి, అక్కడ పడేసి, కాలితో గొంతు నొక్కి చంపేసి వెళ్లిపోయాడు. 16వ తేదీ పందులు మేపుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
జేబులోని ఫోన్ డైరీ, నల్లపూసల తాళిబొట్టు ద్వారా ఆధారాలు సేకరించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ధర్మరాజుపై పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మూడో మైలు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ధర్మరాజు కంటపడడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీం తో ధర్మరాజును అరెస్టు చేసి హత్యకు వాడిన లగేజీ ఆటో, గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో చొరవ చూపిన డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్‌ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, ఏఎస్సైలు ఈఎంఎస్.నాయుడు, శంకరయ్య, సిబ్బంది మణి, అలీ, షణ్ముగం, మునిమోహన్, సోము, ఐడీ పార్టీ రవిప్రకాష్, విజయకుమార్‌రాజు, రవిరెడ్డిలను తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి అభినందించారు.