రహీమ్ (ఫైల్)
సాక్షి, కోదాడరూరల్ : కోదాడలో అదృశ్యమై..ఖమ్మం జిల్లా పాలేరు వాగులో విగతజీవుడిగా తేలిన యువకుడిది హత్యగానే పోలీసులు తేల్చారు. ఆ యువకుడితో సఖ్యతగా మెలిగిన వివాహిత, తన భర్త, తల్లి, మరో వ్యక్తి కలిసి దారుణానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో తేలింది. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నడిగూడెం మండల కాగిత రామచంద్రాపురానికి చెందిన షేక్ రహీమ్(24) లారీక్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు కోటయ్య భార్య త్రివేణితో సఖ్యతగా మెలిగాడు.
ఎనిమిది మాసాలు సాగిన అనంతరం విషయం భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. కోటయ్య విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించాడు. కానీ రహీమ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోటయ్య తన భార్య త్రివేణిని కోదాడలోని ఆజాద్‌నగర్‌లో నివాసముంటున్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం పంపించాడు. నెల రోజుల కిత్రం భార్య వద్దకు వచ్చిన కోటయ్య నీ వల్ల గ్రామంలో మన పరువు పోయింది.. చనిపోదామని చెప్పాడు. రహీమ్ తనను వేధిస్తున్నాడు.. మనమెందుకు చనిపోవాలి.. అతడినే మట్టుబెడదామని తీర్మానించుకున్నారు.
ప్లాన్ ప్రకారమే...
రహీమ్‌ను హత్య చేద్దామని కోటయ్య ,భార్య త్రివేణి అతని అత్త శ్రీదేవి ఆమెతో సఖ్యతగా ఉంటున్న బండి వాసులు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే గత ఫిబ్రవరి 26 రాత్రి 11.30 గంటల సమయంలో త్రివేణి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను రమ్మని రహీమ్‌ను ఫోన్‌చేసి పిలిచింది. అతను ఇంట్లోకి వెళ్లగానే అçప్పటికే కాపుకాసుకుని ఉన్న ముగ్గురు ఇంట్లోకి వెళ్లిన రహీమ్‌ను రొకలిబండతో కళ్లపై కొట్టి ..చున్నితో మెడకు ఉరేసి హత్య చేశారు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గొనెసంచిలో కట్టి మునగాల వద్ద సాగర్ కాల్వలో పడేసారు. ఆ తర్వాత అనుమానం రాకుండా యాథా విధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో..
రహీమ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదని తండ్రి నాగుల్ మీరా ఈ నెల 8వ తేదీన పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగా గతంలో జరిగిన గొడవలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోటయ్య, త్రివేణి కదలికలు, ఫోన్‌కాల్స్‌పై దృష్టిసారించారు. రహీం మృతదేహం సోమవారం పాలేరువాగులో లభ్యం కావడం, అతడి ఒంటిపై గాయాలుండడంతో హత్యగానే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. మంగళవారం కోదాడలోని ఆజాద్‌నగర్‌లో కోటయ్య అతని భార్య త్రివేణి, అత్త శ్రీదేవి ఈమే సహజీవనం చేస్తున్న బండి వాసులను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ క్రాంతికుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment