
గడ్డ కట్టిన సిమెంట్ బస్తాను విప్పి చూపిస్తున్న దృశ్యం
అనంతపురం, రాప్తాడు: సామంత రాజుల పాలన ఎలా సాగుతుందో వెంకటేష్ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. రాప్తాడు మండలంలో మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ చెప్పిందే వేదం. మండలంలో ఏ పని చేసిన ఆయనకు కమీషన్లు ఇవ్వాల్సిందే. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను సైతం మురళీ వదలడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. రూ.లక్ష వర్క్ ఇస్తే రూ.10 వేలు ఆయనకు ముట్టజెప్పాల్సిందేనట. ఇక.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి ఏ అధికారంతో మండలానికి ఒకరిని ఇన్‌చార్జ్‌లుగా పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మరూరు పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటేష్ ఒక్కడే కాదు అన్ని మండలాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. రాప్తాడు మండలంలో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కాపాడుకుంటూ వస్తే మంత్రి సోదరుడు మురళీ భ్రష్టు పట్టించాడని టీడీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోదరుడు మురళీ, ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌కు విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రసాద్‌ను మళ్లీ బెదిరించి టీడీపీలోనే కొనసాగుతానంటూ పత్రికల్లో వార్తలు కూడా రాయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీపీ చిన్నాన్న నెట్టేం వెంకటేష్ పార్టీని విడి బయటకు వచ్చాడు.
ఇన్‌చార్జ్‌లు చెబితేనే పనులు
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇన్‌చార్జులు చెబితేనే అధికారులు పనులు చేయాలి. లేకుంటే వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయిస్తారన్న విమర్శలున్నాయి. చేసేదేమీ లేక అధికారులు తమకు ఇష్టం లేకున్నా ఇన్‌చార్జీలు చెప్పినట్లు పనులు చేస్తున్నారు. ఆత్మకూరు, రాప్తాడుకు సునీత సోదరులు బాలాజీ, మురళీ, చెన్నేకొత్తపల్లికి మంత్రి చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి, అనంతపురం రూరల్‌కు పరిటాల మహీంద్రా, రామగిరికి రామ్మూర్తి నాయుడు, కనగానపల్లికి నెట్టెం వెంకటేశ్‌లను నియమించారు. వీరు అభివృద్ధిని పక్కన పెట్టి ఆయా మండలాల్లో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా
రాప్తాడు నియోజకవర్గంలో సాగుతున్న సామంత రాజుల పాలనపై టీడీపీకి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. చాలామంది ద్వితీయ శ్రేణి బీసీ నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెక్ డ్యాం పనులు చేజిక్కించుకున్న టీడీపీ నేత గోపాల్ గడ్డ కట్టిన సిమెంట్‌ని పోడి చేసి చెక్ డ్యాం పనులకు వినియోగిస్తున్నారు. ఇలాంటి సిమెంట్‌ను వాడితే చెక్ డ్యాంలు నాణ్యత కోల్పోతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్ డ్యాంలు నాణ్యతగా నిర్మించేలా చూడాలి. – వెంటకేష్ , మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment