ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి | Partnership of the Fatherland | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి

Published Fri, Oct 3 2014 2:41 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి - Sakshi

ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి

  • అర్హులందరికీ పింఛన్లు
  • జన్మభూమి-మాఊరు ప్రారంభసభలో మంత్రి బొజ్జల
  • ఎన్‌ఆర్ పేటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి ప్రారంభం
  • చిత్తూరు (టౌన్): ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, సహకారశాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి చిత్తూరులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని అక్కడే లాంఛనంగా ప్రారంభించారు.  

    ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదన్నారు. అందుకే చంద్రబాబు వారిచేతనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెంచిన పింఛన్లను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. గతంలో ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచినట్టు వివరించారు. గతంలో పింఛన్ల మంజూరులో అవకతవకలు జరిగినట్టు తెలియడంతో వాటిపై సర్వేచేసి అనర్హులకు రద్దుచేశామన్నారు. అర్హులకు ఎక్కడైనా పింఛన్ రద్దయివుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిశీలించి మంజూరు చేస్తారన్నారు.

    జన్మభూమి స్పెషలాఫీసర్ ఎస్‌ఎస్ రావత్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ముఖ్య సిద్ధాంతంతో మాఊరు కార్యక్రమాన్ని సీఎం ప్రవేశపెట్టారన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ గ్రామాలను బాగుచేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాఊరు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తీర్చడం కోసం ప్రభుత్వం సూక్ష్మప్రణాళికను అమలు చేస్తోందన్నారు. అందరూ విజన్ మోడ్‌తో పనిచేసిన నాడే అది సాధ్యమన్నారు.

    చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ  గాంధీ జయంతి రోజు  జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు నాయుడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజాసమస్యలను తెలుసుకోగలిగారన్నారు. వాటి పరిష్కారం కోసమే నేడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. అంతకుముందు జన్మభూమి ర్యాలీని మంత్రి ప్రారంభించారు.

    జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీరామనేని గీర్వాణి, మేయర్ కటారి అనురాధ, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా,  ఏజెసీ వెంకటసుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శివకుమార్, వ్యవసాయశాఖ జేడీ రవికుమార్, పశుసంవర్థకశాఖ జేడీ శ్రీనివాసరావు, ఎసీడీఎస్ పీడీ ఉషాఫణికర్,డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్య,  డీసీహెచ్‌ఎస్ కనకదుర్గ,  డ్వామా పీడీ గోపీచంద్, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి,  డీఈవో ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో లక్ష్మి,  డీపీవో ప్రభాకర్‌రావు,  సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనుంజయరావు, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్, చిత్తూరు ఆర్డీవో  పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్తూరు రూరల్ మండలంలోని ఎన్‌ఆర్ పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement