చిత్తూరు (అర్బన్): రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ విజయకుమార్, ఎస్‌ఐ రాజశేఖర్, ఉమామహేశ్వర్‌లు యువకుడిని అరెస్టు చూపించి, వివరాలు వెల్లడించారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లె గ్రామానికి చెందిన జగన్‌రెడ్డి (20) అనే యువకుడు హైదరాబాదులో సీపెట్ కోర్సు చేస్తున్నాడు. ఇతను ఇంటర్నెట్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్ నంబర్లు సేకరించాడు. ‘ మీ అక్రమ సంపాదన, అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఇవి మీడియాకు ఇవ్వకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలి..’ అంటూ ఎస్‌ఎంఎస్‌లు పెట్టాడు.
దీనిపై ఎవరూ స్పందించలేదు. ఈనెల 3న మంత్రి బొజ్జల మెసేజ్ చూసి, వివరాలు తెలుసుకోమని తన కుమారుడికి పురమాయించాడు. అనంతరం బొజ్జల కుమారుడు నిందితుడితో మాట్లాడగా ఓ బ్యాంకు అకౌంట్ నంబరు ఇచ్చి, ఇందులో రూ.30 వేలు జమ చేయాలని చెప్పాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ ఎస్‌ఐ రాజశేఖర్, జగన్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
మంత్రి బొజ్జలకు బెదిరింపు ఫోన్ కాల్
Published Sat, May 7 2016 10:00 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement