రఘువీరా రెడ్డి
హైదరాబాద్: రెండు నెలల్లో ఏపీ కాంగ్రెస్‌ను పునర్ వ్యవస్థీకరిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. మండల, జిల్లా అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఆహ్వానించి, రెండు రోజుల వర్క్ షాపు నిర్వహిస్తామని చెప్పారు. ఇందిరాభవన్‌లో ఈ రోజు జరిగిన ఏపీసీసీ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త రుణాలు ఇప్పించాలన్నారు. గత ఏడాది 1314 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని తక్షణమే విడుదల చేయాల డిమాండ్ చేశారు.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలన్నీ అమలు జరపాలన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇప్పుడున్న ఆదర్శ రైతులను, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించడం సరికాదని చెప్పారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని కోరారు.
శ్వేత పత్రాల పేరిట చంద్రబాబు విడుదల చేస్తున్న అవాస్తవ పచ్చ పత్రాల బండారాన్ని ప్రజల్లోనే బయటపెడతామన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని రఘువీరా అన్నారు.