పంచాయతీల్లో ఈ-పాస్ విధానం | pass approach | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో ఈ-పాస్ విధానం

Published Mon, Feb 16 2015 2:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

pass approach

నెల్లూరు(రెవెన్యూ) : చౌకదుకాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి విడతగా మున్సిపాలిటీల్లోని చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్, గూడూరు, కావలి, ఆత్మకూరు తదితర మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 1874 చౌకదుకాణాలున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 3.50 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటిల్లో 800 చౌకదుకాణాలు ఉన్నాయి.
 
 మొదటి విడతగా 800 చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రక్రియకు అవసరమైన బయోమెట్రిక్ కిట్లను సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో రేషన్‌కార్డులు, ఆధార్ నంబర్ల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. బయోమెట్రిక్ యంత్రాలు వచ్చిన అనంతరం కార్డుదారుల వేలిముద్రలతో సహా పూర్తి వివరాలను వాటిలో పొందుపరుస్తారు. వచ్చే నెల నుంచి సంబంధిత కార్డుదారుడు చౌకదుకాణానికి పోయి వేలిముద్రలు వేస్తేనే రేషన్ పంపిణీ చేస్తారు. ఈ-పాస్ విధానంపై డీలర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
 
 బయోమెట్రిక్ విధానం ద్వారానే కిరోసిన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 4 వేల కిలోలీటర్ల కిరోసిన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. పేదలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. వందల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాలకు చేరకుండానే దొడ్డిదారిన మిల్లులకు చేరుతున్నాయి. ఈ బియ్యాన్ని రీసైకిలింగ్ చేసి అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ పేదల బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. బియ్యం లారీల హద్దులు దాటే విషయంలో అధికారులకు ప్రతి నెలా ముడుపులు అందుతున్నాయి.
 
  పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన కిరోసిన్ 50 శాతానికిపైగా చౌకదుకాణాలకే చేరడంలేదు. హోల్‌సేల్ డీలర్లు చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను పక్కదారిన లారీలు, సిటీ బస్సుల యజమానులకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. డీజిల్ ధర అధికంగా ఉండడంతో లారీలకు కిరోసిన్ వినియోగిస్తున్నారు. నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో కిరోసిన్ నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-పాస్ విధానాన్ని అమలు చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నారు.
 
 పింఛన్ల పంపిణీ కూడా..
 జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, కల్లుగీత కార్మికుల పింఛన్ లబ్ధిదారులు 2.45 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి చౌకదుకాణాల ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చౌకదుకాణాలల్లో బయోమెట్రిక్ మిషన్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు అందుబాటులో ఉండడంతో పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
 
 ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ
 వచ్చే నెల నుంచి చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నాం. వచ్చే వారంలో బయోమెట్రిక్ మిషన్లు జిల్లాకు రానున్నాయి. ఈ-పాస్ విధానానికి సంబంధించి రేషన్ కార్డుదారుల పూర్తి వివరాలు మిషన్లలో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మిషన్లను డీలర్లకు అప్పగిస్తాం. ఈ-పాస్ విధానం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు చేపడుతాం.    
 - సంధ్యారాణి, డీఎస్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement