
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘వైద్యో నారాయణో హరి’ అని వైద్యులను దేవుడితో సమానంగా పోల్చుతాం. ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేది వైద్యుడే. అటువంటిది వైద్యులపై రోగి సహాయకులు రెచ్చిపోతున్నారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన సునీత అపెండిసైటీస్ సమస్యతో ఈ నెల 25న అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎఫ్‌ఎస్ 4లో అడ్మిట్ అయ్యింది. డ్యూటీ డాక్టర్ ఉజ్జునేశ్వరి వైద్య పరీక్షలకు రెఫర్ చేసి, ఈ నెల 26న సర్జరీ చేస్తామని చెప్పారు. అదే రోజున ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులకు ఎస్‌ఆర్ క్యానులాపై శిక్షణ జరిగింది. అనస్తీషియా వైద్యులు టేబుల్స్ ఖాళీ లేవని, ఉన్న వాటిలో ఎమర్జెన్సీ కేసులు చేస్తున్నామని చెప్పారు.
నివారం డాక్టర్ ఉజ్జునేశ్వరి వచ్చి ఆందోళన చెందాల్సిన పనిలేదని, త్వరలో సర్జరీ చేస్తామని సునీత కుటుంబీకులకు తెలిపారు. అయితే సర్జరీ జాప్యం జరిగిందని సునీత బంధువులు శ్రీనివాస్ నాయక్ ఊగిపోయాడు. ఏడో నంబరు ఓపీ గదిలో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ ఉజ్జునేశ్వరిపై చిందులు వేశాడు. ‘ఏం నీకు చేతకాకపోతే చెప్పు.. ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. వేరే ఆస్పత్రిలో చూపించుకుంటాం’ అంటూ కేస్‌షీట్‌ను ముఖంపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఓపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యులపై ఎక్కడ దాడి జరుగుతుందోనని హౌస్‌సర్జన్లు ఆందోళన చెందారు. శ్రీనివాస్ నాయక్ మాటలకు వైద్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
సూపరింటెండెంట్ ఆగ్రహం
విషయం ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌కు తెలియడంతో ఆయన రోగి సహాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షణం తీరిక లేకుండా సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. సర్జరీకి టేబుళ్లు ఖాళీ లేకపోతే ఎక్కడ చేయాలో మీరే చెప్పండి అంటూ ప్రశ్నించారు. చివరకు శ్రీనివాస్ నాయక్ వైద్యురాలికి క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment