Anantapur Govt Hospital
-
చేతకాకపోతే చెప్పండి.. వెళ్లిపోతాం!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘వైద్యో నారాయణో హరి’ అని వైద్యులను దేవుడితో సమానంగా పోల్చుతాం. ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేది వైద్యుడే. అటువంటిది వైద్యులపై రోగి సహాయకులు రెచ్చిపోతున్నారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన సునీత అపెండిసైటీస్ సమస్యతో ఈ నెల 25న అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎఫ్ఎస్ 4లో అడ్మిట్ అయ్యింది. డ్యూటీ డాక్టర్ ఉజ్జునేశ్వరి వైద్య పరీక్షలకు రెఫర్ చేసి, ఈ నెల 26న సర్జరీ చేస్తామని చెప్పారు. అదే రోజున ఆపరేషన్ థియేటర్లో వైద్యులకు ఎస్ఆర్ క్యానులాపై శిక్షణ జరిగింది. అనస్తీషియా వైద్యులు టేబుల్స్ ఖాళీ లేవని, ఉన్న వాటిలో ఎమర్జెన్సీ కేసులు చేస్తున్నామని చెప్పారు. నివారం డాక్టర్ ఉజ్జునేశ్వరి వచ్చి ఆందోళన చెందాల్సిన పనిలేదని, త్వరలో సర్జరీ చేస్తామని సునీత కుటుంబీకులకు తెలిపారు. అయితే సర్జరీ జాప్యం జరిగిందని సునీత బంధువులు శ్రీనివాస్ నాయక్ ఊగిపోయాడు. ఏడో నంబరు ఓపీ గదిలో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ ఉజ్జునేశ్వరిపై చిందులు వేశాడు. ‘ఏం నీకు చేతకాకపోతే చెప్పు.. ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. వేరే ఆస్పత్రిలో చూపించుకుంటాం’ అంటూ కేస్‌షీట్‌ను ముఖంపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఓపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యులపై ఎక్కడ దాడి జరుగుతుందోనని హౌస్సర్జన్లు ఆందోళన చెందారు. శ్రీనివాస్ నాయక్ మాటలకు వైద్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు. సూపరింటెండెంట్ ఆగ్రహం విషయం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌కు తెలియడంతో ఆయన రోగి సహాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షణం తీరిక లేకుండా సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. సర్జరీకి టేబుళ్లు ఖాళీ లేకపోతే ఎక్కడ చేయాలో మీరే చెప్పండి అంటూ ప్రశ్నించారు. చివరకు శ్రీనివాస్ నాయక్ వైద్యురాలికి క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: ఓ బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. రక్తం ఎక్కించే సమయంలో పొరపాటే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన ఎం.సుకన్య(26)ను రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో చేర్చారు. ఈ నెల 19న ఆమెకు సిజేరియన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. అదే రోజు ఓ–నెగిటివ్ రక్తం ఎక్కించారు. సుకన్యకు యూరిన్ రాకపోవడంతో వైద్యులు పరీక్షించి.. నెఫ్రాలజీ సేవలు అవసరమని కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. భర్త శివప్రసాద్, కుటుంబ సభ్యులు ఆమెను 20వ తేదీ కర్నూలు ఏఎంసీకి తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. వందలాదిమందితో ఆందోళన: కర్నూలులోని కొందరు ఆస్పత్రి సిబ్బంది రక్త మార్పిడి సరిగా జరగలేదని చెప్పారని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు వందలాదిమందితో ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రి ఎదుట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రక్తమార్పిడిపై అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే తెలుస్తుందని ఆర్ఎంవో డాక్టర్ లలిత చెప్పారు. ఇదే విషయమై గైనిక్ హెచ్ఓడీలు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ సంధ్యలను ‘సాక్షి’ ఆరా తీయగా.. సుకన్యకు ఆమె గ్రూపు రక్తం(ఓ–నెగిటివ్) ఎక్కించామని, యూరిన్ రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేసినట్టు వివరించారు. -
బల్లికి 3,000.. ఎలుకకు 10,000
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ‘పెస్ట్’ కంట్రోల్ పేరిట భారీ అవినీతి పర్వానికి తెరలేచింది. ఒక బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు.. ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు ముట్టచెబుతూ కాంట్రాక్టర్‌పై కనకవర్షం కురిపిస్తున్నారు. ఇలా గడచిన నాలుగేళ్ల కాలంలో ఏకంగా రూ.45 లక్షల మేర ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టి తమ మమకారాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పెస్ట్’ కంట్రోల్ పేరిట ఈ ఎలుకలు పట్టే పథకానికి శ్రీకారం చుడుతూ..కాంట్రాక్టు సొమ్మును భారీగా పెంచేస్తూ, ఆ పనిని కొంతమంది టీడీపీ నేతల ముఖ్య అనుచరులైన కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. ఆ నేపథ్యంలోనే ఎలుకలు, బల్లుల పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకునేందుకు మార్గం సుగమం అయింది. అప్పట్లో తమ జిల్లా వాసి సీఎం అంటూ.. చిత్తూరుకు చెందిన పద్మావతి కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ఫెస్ట్ కంట్రోల్ పనులను దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కింద ఆస్పత్రిలో 6గురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురికి మించి పనిచేయకపోయినప్పటికీ అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి. పైగా ఆస్పత్రిలో లేని ఎలుకలు, బల్లులను పట్టినట్లు కాగితాల్లో చూపి లక్షలకు లక్షలు దోచుకున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇప్పటివరకు గత నాలుగేళ్లల్లో మొత్తం 1,429 ఎలుకలు, 230 బల్లులను పట్టుకున్నట్టు చూపి ఏకంగా రూ.45 లక్షల మేర బిల్లులను జేబులో వేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేయడానికి అలవాటు పడిన కాంట్రాక్టర్ కాంట్రాక్టు గడువు సమయం ముగిసినప్పటికీ..దానిని మరో రెండేళ్లు పొడిగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా పెస్ట్ కంట్రోల్ పేరిట 2016 జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పంద సమయం మొన్నటి జూన్‌తో ముగిసినప్పటికీ.. ఇంకా ఎలుకలు, బల్లులు పట్టే పనిని కొనసాగిస్తూ బిల్లులు చెల్లించాలని ప్రస్తుత అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మాదే ప్రభుత్వం..! వాస్తవానికి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సదరు కాంట్రాక్టర్లు.. రాష్ట్రస్థాయిలో పిలిచిన టెండర్లలో ఈ పనులను కైవసం చేసుకున్నారు. అనేక జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఎలుకలు, బల్లులు కూడా లేవు. అయినప్పటికీ ఉన్నట్టుగా చూపించి... ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు. కాంట్రాక్టులో భాగంగా పట్టని ఎలుకలు, బల్లులను కూడా లెక్కల్లో చూపించి మరీ ప్రతీ నెలా బిల్లులను డ్రా చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. అప్పటి సీఎం చంద్రబాబు జిల్లాకు చెందిన వ్యక్తి కాంట్రాక్టర్ కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్టుగా ఎక్కడ చెపితే అక్కడ సంతకం పెట్టి మరీ బిల్లులు మంజూరు చేసినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టింది పది.. లెక్కల్లో వందలు..! వాస్తవానికి అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు ఉండడం తక్కువనే చెప్పాలి. అదే విధంగా బల్లుల సంఖ్య కూడా తక్కువే. అయితే, పెస్ట్‌కంట్రోల్ పేరిట చిత్తూరుకు చెందిన పద్మావతి కాంట్రాక్టు సంస్థకు నెలకు లక్షా 20వేల చొప్పున చెల్లించే విధంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి నెలకు పట్టిన ఎలుకలు, బల్లుల సంఖ్య కేవలం సింగిల్ డిజిట్లో ఉన్నప్పటికీ.. వందల్లో పట్టుకున్నట్టు చూపించి సొమ్మును దిగమింగేశారు. -
సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ బాబూలాల్
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా ప్రొఫెసర్ డాక్టర్ బాబూలాల్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బాబూలాల్ ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఈయనను తక్షణమే సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాక్టర్ లాల్ విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా 2018 మే నుంచి పనిచేస్తూ ఉద్యోగులు, వైద్యులను సమన్వయపరుస్తూ సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు పనిచేసిన వారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనగా, డాక్టర్ లాల్ మాత్రం ఏడాదిగా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పనిచేస్తూ వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డాక్టర్ జగన్నాథ్‌ను నిబంధనలకు విరుద్ధంగా సూపరింటెండెంట్ పోస్టులో నియమించడం తెలిసిందే. 19 మంది ప్రొఫెసర్లను కాదని ఆయనకు ఆ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆయనను ప్రభుత్వం సూపరింటెండెంట్ విధుల నుంచి తప్పించింది. -
ప్రాణం తీసి.. ‘బీ పాజిటివ్’ అంటున్నారు
అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్.అక్తర్‌భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌నే బురిడీ కొట్టించేందుకు వైద్యుల బృందం యత్నించింది. సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఈ నెల 27న బాలింత ఎస్.అక్తర్‌భాను మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సి ఉండగా.. బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మరణించింది. ఈ విషయమై ‘ఆస్పత్రి నిర్లక్ష్యం–బాలింత మృతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కాగా.. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. బాలింత మృతికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణలో భాగంగా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్‌తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఘటనపై పక్కా నివేదిక ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు, పెథాలజిస్టులు మృతురాలు అక్తర్‌భాను బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ అని రాసి ఉన్న రికార్డులను కలెక్టర్‌కు చూపించారు. అంతేకాకుండా వేరొకరి రక్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ సమక్షంలో బీ పాజిటివ్‌గా నిర్థారణ చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించని కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి పి.ప్రశాంతిని విచారణ అధికారిగా నియమించగా, వారు సుదీర్ఘంగా విచారించి మృతురాలి బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ కాగా.. బీ పాజిటివ్ రక్తం ఎక్కించినట్టు గుర్తించారు. గైనిక్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలింత మరణించినట్టు నిర్థారణకు వచ్చారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుకుంటారు. డీఎంహెచ్ఓ చొరవతో వెలుగులోకి.. ఈ నెల 26న ఇతర రక్త పరీక్షల కోసం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాలింత బ్లడ్ శ్యాంపిల్స్‌ను రాయలసీమ డయాగ్నొస్టిక్కు పంపారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ పలుమార్లు పెథాలజిస్టుతో బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయించగా అసలు నిజం వెలుగు చూసింది. -
చంపేశారయ్యా...
సాక్షి, అనంతపురం : అనంతపురం సర్వజనాస్పత్రిలో పసికందు మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయిందని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలంటూ మూడుగంటలపాటు ఆందోళనకు దిగారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురానికి చెందిన నాగసులోచన రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఓ వైద్యురాలు పరీక్షించగా వారాల ప్రకారం డెలివరీ డేట్ 17 అని తేలింది. దీంతో మరోసారి స్కానింగ్ రిపోర్టు తీసుకురావాలని సూచించారు. ఈ నెల 18న స్కానింగ్ చేయగా డెలివరీ డేట్ 27న అని వచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సులోచన నొప్పులు వస్తున్నాయని అని చెప్పడంతో వైద్యులు మరోసారి పరీక్షించారు. ఉదయం జెల్ అందించారు. సాయంత్రంలోపు ప్రసవం అవుతుందని చెప్పారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లేబర్‌వార్డులోకి ఆమెను తీసుకెళ్లారు. బిడ్డ బయటకు వస్తూ, లోపలికి వెళ్తూ ఉండటంతో వైద్యులు ఎఫిషియాటమీ (రంధ్రం కట్ చేయడం) చేశారు. 7 గంటలకు డెలివరీ కాగా.. పుట్టిన ఆడబిడ్డలో ఎటువంటి స్పందనలు కనిపించలేదు. దీంతో బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు. వాగ్వాదం పసికందు(ఆడ) చనిపోవడంతో తండ్రి వెంకటగోపాల్, అవ్వ మల్లమ్మ, కుటుంబ సభ్యులు మల్లికార్జున, ఓబులేసు ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, ఆర్ఎంఓ, గైనిక్ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మీ నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయిందని ఆరోపించారు. పురిటిశాల ముందు పసికందుతో బైఠాయించారు. పసికందు తలకు గాయమైందని, అలా ఎందుకయ్యిందంటూ వారు వైద్యులతో వాదనకు దిగారు. బిడ్డ పుట్టినప్పుడు రక్తపు మరకలు అవుతాయని వైద్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. గంట క్రితం బాగుందని చెప్పి చనిపోయిన బిడ్డను చేతికిచ్చారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
వైద్యం.. దైవాధీనం
శుక్రవారం ఉదయం 8.36 గంటలకు : రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగప్ప సర్జికల్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఇతని కాలుకు సర్జరీ చేయాల్సి ఉంది. పై అంతస్తులోని సర్జికల్ వార్డు నుంచి నల్లప్ప తన భార్య మల్లక్క సాయంతో అతి కష్టం మీద ఆపరేషన్ థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో వేళ్లూనిన నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. అందుబాటులో ఉండాల్సిన ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో నల్లప్పకు కాస్త బీపీ ఎక్కు వైనా పరిస్థితి ఊహించడమే కష్టం. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యం దైవాధీనంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కుగా సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో రోగుల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. పాలనా వైఫల్యం కారణంగా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఈ ఏడాదిలో ఇప్పటికే 170 చిన్నారులు మృత్యువాతపడ్డారు. అదేవిధంగా పలు విభాగాల్లో వైద్యుల ఇష్టారాజ్యం, స్టాఫ్ నర్సులపై పనిభారం.. తరచూ విద్యుత్ సమస్య.. ఏసీలు, ఫ్యాన్లు.. ఇతరత్రా పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగులు ప్రత్యేక్ష నరకం చూస్తున్నారు. దీనికి తోడు ఓ ఉన్నతాధికారి అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 19 మంది సీనియర్ ప్రొఫెసర్లను కాదని సూపరింటెండెంట్‌గా అర్హుడికి పట్టం కట్టింది. గత జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రిపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడా ఆసుపత్రిలో సేవలు అందకపోవడానికి కారణమైంది. గత మూడేళ్లుగా రోగుల అవస్థలు చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిగా పేరున్నా.. ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల బోధనాసుపత్రికి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు మరో 250 పడకలు ఆసుపత్రికి రానున్నాయి. కానీ ఆసుపత్రిలో రోజూ 1,300 అడ్మిషన్, 2వేల మంది ఔట్ పేషెంట్లు ఉంటున్నారు. అయితే కొందరు వైద్యుల ఇష్టారాజ్యం కారణంగా సరైన వైద్య సేవలు అందక ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇకపోతే 2010లో అప్పటి ప్రభుత్వం జీఓ 124ను విడుదల చేసింది. ఆ మేరకు 649 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఆ జీఓ కలగా మారడంతో పోస్టులు భర్తీకాక ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతోంది. పసికందుల ప్రాణాలతో చెలగాటం ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని(ఎస్ఎన్సీయూ) పట్టించుకునే నాథుడే లేరు. హెచ్ఓడీ.. ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఇన్చార్జ్ బాధ్యతలిచ్చినా.. ఆయన పట్టించుకోకపోవడంతో నలుగురు వైద్యులకే యూనిట్ అప్పగించి చేతులు దులుపుకున్నారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు కూడా పసికందులకందించే సేవల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కరువైంది. పాలు పట్టించే సమయంలో తల్లులకు సూచనలివ్వాల్సిన స్టాఫ్‌నర్సులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలు సరిగా పట్టించకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి పసికందులు మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. చిన్నపిల్లల విభాగంలో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఏడాది నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు. ఈయనకు మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించకపోవడం గమనార్హం. ఇక్కడుండే మరో అసోసియేట్ ప్రొఫెసర్ డెప్యూటేషన్‌పై కర్నూలుకు వెళ్లిపోయారు. అర్హత లేకపోయినా అందలం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు ఆర్‌ఎంఓలు తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉంటున్న వీరు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(ఎమర్జెన్సీ వైద్యులు) ఆర్ఎంఓ సీట్లలో కూర్చుని పనులు చేసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా డాక్టర్ జగన్నాథ్‌కి సూపరింటెండెంట్ పోస్టులో కూర్చునేందుకు ఎలాంటి అర్హత లేకున్నా అధికార పార్టీ అండదండలతో ఆయన ఆ సీటులో కొనసాగుతున్నారు. పనులు నత్తనడక.. ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్, బరŠన్స్ వార్డు, 150 సీట్లకు సంబంధించి రూ.70 కోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీట్ల పెంపునకు సంబంధించి పట్టుమని 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఎన్ఏబీహెచ్కి సంబంధించిన కొన్ని పనులు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి చేపడుతుండడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అజెండా: మంత్రి రాక నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ఓ అజెండాను సిద్ధం చేసింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు జీఓ 124, నెల్లూరు ఆస్పత్రి తరహాలో ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ విభాగం, మెడిసిన్, ఈఎన్టీ, గైనిక్, ఆప్తమాలజీ, తదితర విభాగాల్లో యూనిట్ల పెంపు, పరికాల కొనుగోలుకు రూ.2కోట్లు ఇవ్వాలనే అజెండాను యాజమ్యాం సిద్ధం చేసింది. ఈ అజెండాను మంత్రికి అందజేయనున్నారు. అడ్డూఅదుపు లేని అవినీతి ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఓ కీలక అధికారికి కాసులిస్తే ఏ పనైనా ఇట్టే జరిగిపోతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఖైదీని ఎలాంటి రోగం లేకున్నా నెలల తరబడి వార్డులో ఉంచారు. ఓ ఆర్థో వైద్యుడు అడ్మిషన్లో కీలకంగా వ్యవహరించినా సూపరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెడికల్ రికార్డు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఏజెన్సీకి కట్టబెట్టడం, టెండర్లు లేకుండా ఏసీలు కొనుగోలు, ఆఫీస్ కార్యాలయంలో డెప్యూటేషన్, పదోన్నతులు, రాయితీలు కావాలన్నా సిబ్బంది చేయి తడపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్ చేశారు. అంతా ఆ అధికారి కనుసన్నల్లోనే అక్రమాల బాగోతం సాగుతోంది. సూపర్ స్పెషాలిటీకి మోక్షమెప్పుడో? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మోక్షమెప్పుడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైంది. 2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ వాట రూ.30 కోట్లు విడుదల చేయలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. తామే పనులు చేయిస్తున్నామంటూ పాలకులు ప్రజలను మభ్యపెట్టారు. ఆస్పత్రి ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్యం కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర సేవలు అందుబాటులోకి వస్తాయి. నేడు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాక అనంతపురం అర్బన్: ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 6.20 గంటలకు అనంతపురం చేరుకోనున్న ఆయన.. ఆర్అండ్బీ అతిథిగృహంలో విడిది చేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, పోస్ట్‌నేటల్ వార్డు, చిన్నపిల్లల వార్డును సందర్శిస్తారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ధర్మవరం చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో రాత్రి 6 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు. -
కాకమ్మ కథలు చెప్పకండి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిశు మరణాలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి తనిఖీ నిర్వహించారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడాలని, కొందరు వైద్యుల వల్లే సమస్యలొస్తున్నాయని, వారు పనితీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. సమన్వయలోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జేసీ–2 సుబ్బరాజుతో కలసి ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూను తనిఖీ చేశారు. యూనిట్లో ఉన్న సదుపాయాలు...అందుతున్న సేవలపై వారు ఆరా తీశారు. చిన్న సమస్యలు పరిష్కరించుకోరా? ఎస్‌ఎన్‌సీయూతో పాటు చాలా వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్లు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించగా..సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అన్నీ పనిచేస్తున్నాయని చెప్పగా..ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా సమాధానమెందుకిస్తారన్నారు. చిన్న సమస్యలను పరిష్కరించుకోకపోతే ఎలాగన్నారు. వార్డులవారీగా సమీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు. తీరు మారకపోతే చర్యలు అనంతరం వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో గత ఐదు నెలల్లో 168 మరణాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైద్యులు కాకమ్మ కథలు చెబుతున్నారని ఎమ్మెల్యే ‘అనంత’ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, చిన్న పిల్లల విభాగాధిపతి మల్లీశ్వరి కల్పించుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి చివరి క్షణంలో కేసులు వస్తున్నాయని చెప్పగా.. చివరి క్షణంలో కేసులు వస్తే రెఫర్ చేసిన ఆస్పత్రి వివరాలను కేస్ షీటులో ఎందుకు నమోదు చేయలేని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెఫరల్ కేసు వివరాలను నమోదు చేయాల్సిందేనన్నారు. ప్రైవేట్ నర్సింగ్‌హోంలపై నిఘా పెంచేలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులే చివరి క్షణంలో కేసులను సర్వజనాస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ సత్యనారాయణ సైతం వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో మరణాలు ఏవిధంగా చోటు చేసుకుంటాయని ప్రశ్నించారు. గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలన చేయాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవికి సూచించారు. శిశుమరణాలపై నివేదిక ఇవ్వండి ఆస్పత్రిలోని విభాగాల అధిపతులంతా బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. వైద్యుల మధ్య సమన్వయలోపం ఎందుకు వస్తోందని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు మరణాలపై విచారణ చేసి త్వరగా పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్‌కు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా అంధత్వ నివారణధికారి డాక్టర్ కన్నేగంటి భాస్కర్, హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామినాయక్, డాక్టర్ నవీన్, డాక్టర్ నవీద్ అహ్మద్, డాక్టర్ ఆత్మారాం పాల్గొన్నారు. -
‘అనంత’ ఆసుపత్రిలో మరణమృదంగం
అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మంగళవారం ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. చిన్నపిల్లల వార్డులో ఒకరు, అదే విభాగానికి సంబంధించి ఎస్‌ఎన్‌సీయూలో ఒకరు, లేబర్ వార్డులో ముగ్గురు పసికందులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారంటూ ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న తన బాబు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడంటూ విలపించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడంతో పెనుప్రమాదం తప్పింది. బిడ్డ కడుపులోనే చనిపోయిందన్నారు.. పెదవడుగూరు మండలం మేడమాకులపల్లికి చెందిన వీరనారాయణచారి తన భార్య ప్రమీలకు మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో హుటాహుటిన సర్వజనాస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు కాసేపట్లో కాన్పు చేస్తామని చెప్పారు. అనంతరం కాన్పు చేసిన వైద్యులు.. మృత శిశువును అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గైనిక్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని వీరనారాయణచారి ఆరోపించాడు. మూడ్రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పడమేంటని తప్పుపట్టాడు. గత నెల 28న పరీక్షలకు వచ్చినప్పుడు కడుపులో బేబి, తల్లి బాగా ఉన్నారని చెప్పి.. అంతలోనే మూడ్రోజుల క్రితమే పాప చనిపోయిందని చెప్పడమేంటన్నాడు. వైద్యుల నిర్వాకంతోనే తమ పాప చనిపోయిందని మండిపడ్డాడు. దీనిపై ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జశ్వంత్(11నెలలు) నిమోనియాతో బాధపడుతుండడంతో గత నెల 25న చిన్నపిల్లల వార్డులో చేర్చారు. మంగళవారం ఉదయం బాబు ఆరోగ్యం కుదుటపడిందని పీఐసీయూ నుంచి సాధారణ వార్డులోకి వైద్యులు మార్చారు. తల్లి కాస్త ఇడ్లీ తిన్పించింది. ఆ తరువాత కొద్ది గంటలకే ఆ తల్లి కేకలేస్తూ పీఐసీయూలోకి వచ్చింది. దీంతో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాబు మృతి చెందినట్టు తెలిపారు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే తన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. అయ్యో దేవుడా! ఎంత పని చేశావయ్యా.. రేపోమాపో ఇంటికి తీసుకెళ్దామనుకుంటే అంతలోనే ఘోరం జరిగిందయ్యా. నాకింకెవ్వరు దిక్కయ్కా అంటూ.. రోదించడం అందర్నీ కలచివేసింది. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బాత్రూంలోకి వెళ్లి చీరతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. మరో ముగ్గురూ.. మరోవైపు ఎన్‌ఎస్‌సీయూలో శెట్టూరు యాటకల్లు గ్రామానికి చెందిన నగ్మ అనే మహిళకు జన్మించిన నెలలు నిండని ఆడబిడ్డ(980 గ్రాములు) మృతిచెందగా, కాన్పుల వార్డులో కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన గౌతమికి పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అదే వార్డులో మరో మహిళకు పుట్టిన మగబిడ్డ కూడా పురిట్లోనే మరణించాడు. ఎన్నడూ లేనివిధంగా లేబర్‌వార్డులో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. విచారణకు ఆదేశిస్తాం.. లేబర్‌వార్డులో పసికందులు చనిపోయిన విషయం తెలియదు. విచారణకు ఆదేశిస్తా. చిన్నపిల్లల వార్డులో జశ్వంత్ అనే బాబు చనిపోయాడు. ఇడ్లీ తిన్పించే సమయంలో అన్నవాహికలో కాకుండా లంగ్స్‌లో పడింది. అందుకే బాబు మృతిచెందాడు. ఎన్‌ఎస్‌సీయూలో ఓ బిడ్డ మృతిచెందింది. –డాక్టర్ జగన్నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
’అనంత’ మృత్యుఘోషలో ఎవరిదీ నిర్లక్ష్యం ?