శుక్రవారం ఉదయం 8.36 గంటలకు : రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగప్ప సర్జికల్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో ఇతని కాలుకు సర్జరీ చేయాల్సి ఉంది. పై అంతస్తులోని సర్జికల్ వార్డు నుంచి నల్లప్ప తన భార్య మల్లక్క సాయంతో అతి కష్టం మీద ఆపరేషన్ థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో వేళ్లూనిన నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. అందుబాటులో ఉండాల్సిన ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలు పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో నల్లప్పకు కాస్త బీపీ ఎక్కు వైనా పరిస్థితి ఊహించడమే కష్టం.
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యం దైవాధీనంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కుగా సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో రోగుల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. పాలనా వైఫల్యం కారణంగా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఈ ఏడాదిలో ఇప్పటికే 170 చిన్నారులు మృత్యువాతపడ్డారు. అదేవిధంగా పలు విభాగాల్లో వైద్యుల ఇష్టారాజ్యం, స్టాఫ్ నర్సులపై పనిభారం.. తరచూ విద్యుత్ సమస్య.. ఏసీలు, ఫ్యాన్లు.. ఇతరత్రా పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగులు ప్రత్యేక్ష నరకం చూస్తున్నారు. దీనికి తోడు ఓ ఉన్నతాధికారి అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 19 మంది సీనియర్ ప్రొఫెసర్లను కాదని సూపరింటెండెంట్‌గా అర్హుడికి పట్టం కట్టింది. గత జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రిపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడా ఆసుపత్రిలో సేవలు అందకపోవడానికి కారణమైంది. గత మూడేళ్లుగా రోగుల అవస్థలు చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిగా పేరున్నా.. ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల బోధనాసుపత్రికి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు మరో 250 పడకలు ఆసుపత్రికి రానున్నాయి.
కానీ ఆసుపత్రిలో రోజూ 1,300 అడ్మిషన్, 2వేల మంది ఔట్ పేషెంట్లు ఉంటున్నారు. అయితే కొందరు వైద్యుల ఇష్టారాజ్యం కారణంగా సరైన వైద్య సేవలు అందక ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇకపోతే 2010లో అప్పటి ప్రభుత్వం జీఓ 124ను విడుదల చేసింది. ఆ మేరకు 649 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఆ జీఓ కలగా మారడంతో పోస్టులు భర్తీకాక ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతోంది.
పసికందుల ప్రాణాలతో చెలగాటం
ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని(ఎస్‌ఎన్‌సీయూ) పట్టించుకునే నాథుడే లేరు. హెచ్‌ఓడీ.. ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఇన్‌చార్జ్ బాధ్యతలిచ్చినా.. ఆయన పట్టించుకోకపోవడంతో నలుగురు వైద్యులకే యూనిట్ అప్పగించి చేతులు దులుపుకున్నారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు కూడా పసికందులకందించే సేవల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కరువైంది. పాలు పట్టించే సమయంలో తల్లులకు సూచనలివ్వాల్సిన స్టాఫ్‌నర్సులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలు సరిగా పట్టించకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి పసికందులు మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.
చిన్నపిల్లల విభాగంలో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఏడాది నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు. ఈయనకు మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించకపోవడం గమనార్హం. ఇక్కడుండే మరో అసోసియేట్ ప్రొఫెసర్ డెప్యూటేషన్‌పై కర్నూలుకు వెళ్లిపోయారు.
అర్హత లేకపోయినా అందలం
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు ఆర్‌ఎంఓలు తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉంటున్న వీరు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(ఎమర్జెన్సీ వైద్యులు) ఆర్‌ఎంఓ సీట్లలో కూర్చుని పనులు చేసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా డాక్టర్ జగన్నాథ్‌కి సూపరింటెండెంట్ పోస్టులో కూర్చునేందుకు ఎలాంటి అర్హత లేకున్నా అధికార పార్టీ అండదండలతో ఆయన ఆ సీటులో కొనసాగుతున్నారు.
పనులు నత్తనడక..
ఆస్పత్రిలో ఎన్‌ఏబీహెచ్, బరŠన్స్ వార్డు, 150 సీట్లకు సంబంధించి రూ.70 కోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీట్ల పెంపునకు సంబంధించి పట్టుమని 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఎన్‌ఏబీహెచ్‌కి సంబంధించిన కొన్ని పనులు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి చేపడుతుండడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
అజెండా: మంత్రి రాక నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ఓ అజెండాను సిద్ధం చేసింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు జీఓ 124, నెల్లూరు ఆస్పత్రి తరహాలో ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ విభాగం, మెడిసిన్, ఈఎన్‌టీ, గైనిక్, ఆప్తమాలజీ, తదితర విభాగాల్లో యూనిట్ల పెంపు, పరికాల కొనుగోలుకు రూ.2కోట్లు ఇవ్వాలనే అజెండాను యాజమ్యాం సిద్ధం చేసింది. ఈ అజెండాను మంత్రికి అందజేయనున్నారు.
అడ్డూఅదుపు లేని అవినీతి
ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఓ కీలక అధికారికి కాసులిస్తే ఏ పనైనా ఇట్టే జరిగిపోతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఖైదీని ఎలాంటి రోగం లేకున్నా నెలల తరబడి వార్డులో ఉంచారు. ఓ ఆర్థో వైద్యుడు అడ్మిషన్‌లో కీలకంగా వ్యవహరించినా సూపరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెడికల్ రికార్డు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఏజెన్సీకి కట్టబెట్టడం, టెండర్లు లేకుండా ఏసీలు కొనుగోలు, ఆఫీస్ కార్యాలయంలో డెప్యూటేషన్, పదోన్నతులు, రాయితీలు కావాలన్నా సిబ్బంది చేయి తడపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్ చేశారు. అంతా ఆ అధికారి కనుసన్నల్లోనే అక్రమాల బాగోతం సాగుతోంది.
సూపర్ స్పెషాలిటీకి మోక్షమెప్పుడో?
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మోక్షమెప్పుడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైంది. 2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్‌లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ వాట రూ.30 కోట్లు విడుదల చేయలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. తామే పనులు చేయిస్తున్నామంటూ పాలకులు ప్రజలను మభ్యపెట్టారు. ఆస్పత్రి ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్యం కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర సేవలు అందుబాటులోకి వస్తాయి.
నేడు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాక
అనంతపురం అర్బన్: ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 6.20 గంటలకు అనంతపురం చేరుకోనున్న ఆయన.. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విడిది చేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, పోస్ట్‌నేటల్ వార్డు, చిన్నపిల్లల వార్డును సందర్శిస్తారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ధర్మవరం చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో రాత్రి 6 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment