బల్లికి 3,000.. ఎలుకకు 10,000 | Ten Thousand for a rat and Three Thousand for a lizard | Sakshi
Sakshi News home page

బల్లికి 3,000.. ఎలుకకు 10,000

Published Sun, Jul 21 2019 3:46 AM | Last Updated on Sun, Jul 21 2019 11:53 AM

Ten Thousand for a rat and Three Thousand for a lizard - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ‘పెస్ట్‌’ కంట్రోల్‌ పేరిట  భారీ అవినీతి పర్వానికి తెరలేచింది. ఒక బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు.. ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు ముట్టచెబుతూ కాంట్రాక్టర్‌పై కనకవర్షం కురిపిస్తున్నారు. ఇలా గడచిన నాలుగేళ్ల కాలంలో ఏకంగా రూ.45 లక్షల మేర  ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టి తమ మమకారాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా  ‘పెస్ట్‌’ కంట్రోల్‌ పేరిట ఈ ఎలుకలు పట్టే పథకానికి శ్రీకారం చుడుతూ..కాంట్రాక్టు సొమ్మును భారీగా పెంచేస్తూ, ఆ పనిని కొంతమంది టీడీపీ నేతల ముఖ్య అనుచరులైన కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. ఆ నేపథ్యంలోనే ఎలుకలు, బల్లుల పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకునేందుకు మార్గం సుగమం అయింది. అప్పట్లో  తమ జిల్లా వాసి సీఎం అంటూ.. చిత్తూరుకు చెందిన  పద్మావతి  కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా ఆస్పత్రిలో ఫెస్ట్‌ కంట్రోల్‌ పనులను దక్కించుకుంది.

ఈ కాంట్రాక్టు కింద ఆస్పత్రిలో 6గురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురికి మించి పనిచేయకపోయినప్పటికీ అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి. పైగా ఆస్పత్రిలో లేని ఎలుకలు, బల్లులను పట్టినట్లు  కాగితాల్లో చూపి లక్షలకు లక్షలు దోచుకున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇప్పటివరకు గత నాలుగేళ్లల్లో మొత్తం 1,429 ఎలుకలు, 230 బల్లులను పట్టుకున్నట్టు చూపి ఏకంగా రూ.45 లక్షల మేర బిల్లులను జేబులో వేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేయడానికి అలవాటు పడిన కాంట్రాక్టర్‌ కాంట్రాక్టు గడువు సమయం ముగిసినప్పటికీ..దానిని మరో రెండేళ్లు పొడిగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా పెస్ట్‌ కంట్రోల్‌ పేరిట 2016 జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పంద సమయం మొన్నటి జూన్‌తో ముగిసినప్పటికీ.. ఇంకా ఎలుకలు, బల్లులు పట్టే పనిని కొనసాగిస్తూ బిల్లులు చెల్లించాలని ప్రస్తుత అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.  
 
మాదే ప్రభుత్వం..! 
వాస్తవానికి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సదరు కాంట్రాక్టర్లు.. రాష్ట్రస్థాయిలో పిలిచిన టెండర్లలో ఈ పనులను కైవసం చేసుకున్నారు. అనేక జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఎలుకలు, బల్లులు కూడా లేవు. అయినప్పటికీ ఉన్నట్టుగా చూపించి... ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు.  కాంట్రాక్టులో భాగంగా పట్టని ఎలుకలు, బల్లులను కూడా లెక్కల్లో చూపించి మరీ ప్రతీ నెలా బిల్లులను డ్రా చేసినట్టు విమర్శలు వస్తున్నాయి.  అప్పటి సీఎం చంద్రబాబు జిల్లాకు చెందిన వ్యక్తి కాంట్రాక్టర్‌ కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్టుగా ఎక్కడ చెపితే అక్కడ సంతకం పెట్టి మరీ బిల్లులు మంజూరు చేసినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.  

పట్టింది పది.. లెక్కల్లో వందలు..! 
వాస్తవానికి అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు ఉండడం తక్కువనే చెప్పాలి. అదే విధంగా బల్లుల సంఖ్య కూడా తక్కువే. అయితే, పెస్ట్‌కంట్రోల్‌ పేరిట చిత్తూరుకు చెందిన పద్మావతి కాంట్రాక్టు సంస్థకు నెలకు లక్షా 20వేల చొప్పున చెల్లించే విధంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి నెలకు పట్టిన ఎలుకలు, బల్లుల సంఖ్య కేవలం సింగిల్‌ డిజిట్లో ఉన్నప్పటికీ.. వందల్లో పట్టుకున్నట్టు చూపించి సొమ్మును దిగమింగేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement