పలమనేరు, న్యూస్‌లైన్: పట్టురైతుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందజేస్తామని పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ సీఎస్ రామలక్ష్మి తెలిపారు. పలమనేరు పట్టణ సమీపంలో గురువారం ఆమె స్థానిక ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డితో కలసి సిల్క్‌పార్కును ప్రారంభించారు. రీలింగ్ కేంద్రం వద్ద రీలర్ల తో, పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్ర సమీపంలోని రైతులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
ప్రపంచస్థాయి సెరికల్చర్ హబ్‌గా పలమనేరును త్వరలో తయారు చేస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బైవోల్టిన్ పట్టుగూళ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో రీలింగ్ యూనిట్ల అవసరం పెరిగిందన్నారు. ఇక్కడ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లతో పాటు మల్టీఎండ్ రీలింగ్ యూనిట్లు, అడ్వాన్స్డ్‌ట్విస్టింగ్ యూనిట్లను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని వ్యాపారులు ఇక్కడ యూనిట్లను ప్రారంభిస్తే 75 శాతం సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. పట్టుగూళ్ల ఉత్పత్తిలో రాష్ర్టంలోనే చిత్తూరు జిల్లా మొదటిస్థానంలో ఉందని, నెలకు టన్ను పట్టుగూళ్లను పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు.
భవిష్యత్‌లో ఐటీ ఉద్యోగాలను వదిలిపెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పట్టుపరిశ్రమ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. ఈ ఏడాది బైవోల్టిన్ పట్టుగూళ్లు 300 టన్నుల ఉత్పత్తయ్యాయన్నారు. రాబోవు రోజుల్లో 3 వేల టన్నుల లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ పట్టుగూళ్ల ఉత్తత్తితో పాటు నాణ్యమైన పట్టుదారం తీసే యూనిట్లు ఈ ప్రాంతంలో మరిన్నింటిని నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో పట్టు రైతులు, రీలర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సెరికల్చర్ జేడీపీజే. శర్మ మాట్లాడుతూ జిల్లాలో 25 వేల ఎకరాల్లో 18 వేల మంది పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. రెండేళ్లుగా సీబీ, సీఎస్‌ఆర్ పట్టుగూళ్ల ఉత్పత్తి 40 శాతం పెరిగినట్టు వెల్లడించారు.
సిల్క్‌పార్క్ ప్రారంభం
పట్టుగూళ్ల మార్కెట్ సమీపంలో రూ.కోటితో నిర్మించిన సిల్క్‌పార్కును ప్రారంభించారు. మల్టీఎండ్, ట్విస్టింగ్ యూనిట్లను కమిషనర్, ఎమ్మెల్సీలు పరిశీలించారు. పట్టుగూళ్ల విక్రయ కేంద్రంలో బైవోల్టిన్ గూళ్ల వేలాన్ని పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ తనిఖీ చేశారు.
పట్టురైతుకు వరాలు
బైవోల్టిన్ చాకీ పురుగుల సబ్సిడీని ఒక్కోరైతుకు రూ.250 నుంచి రూ.750 పెంచినట్టు కమిషనర్ ప్రకటించారు. పట్టుపురుగుల షెడ్లకు (పెద్దసైజు) సబ్సిడీని రూ.లక్ష, షెడ్లకు ముందు వరండాల నిర్మాణానికి రూ.22.500ను మంజూరు చేస్తామన్నారు. ప్లాస్టిక్ చందరీకలను అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్‌బోర్డు మెంబర్ జయరామిరెడ్డి, డెప్యూటీడెరైక్టర్, స్పెషలాఫీసర్ మాలకొండారెడ్డి, ఏడీలు ఢిల్లీబాబు, శివశంకర్ గౌడ్, సైంటిస్టులు మురళి, ప్రసాద్, స్థానిక నాయకులు సుబ్రమణ్యంగౌడు, చెంగారెడ్డి, బాలన్న, ప్రహ్లాద, ఎంహెచ్ ఖాన్ పాల్గొన్నారు.
పట్టురైతుకు మరిన్ని ప్రోత్సాహకాలు
Published Fri, Jan 3 2014 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement