పాపం... పవన్
హైదరాబాద్: అతని పేరు పవన్‌కుమార్. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఎందరివో మృతదేహాలను బయుటకు తీశాడు.. ఆత్మహత్య చేసుకొనేందుకు ‘సాగర్’ జలాల్లో దూకిన ఎందరినో రక్షించాడు... చివరకు తానే ప్రమాదవశాత్తు అదే నీటిలో మునిగి చనిపోయూడు. ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలానికి చెందిన పవన్‌కుమార్ ట్యాంక్‌బండ్ కింద ఉండే కట్టమైసమ్మ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ఉంటూ జీవిస్తున్నాడు. ఏ పని చిక్కితే ఆ పని చేసేవాడు.
హుస్సేన్‌సాగర్‌లో ఏదైనా మృతదేహం తేలియాడుతుంటే పోలీసుల ఆదేశాల మేరకు బయటకు తీసేవాడు. ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. అలాగే, వినాయక నిమజ్జనం తర్వాత సాగర్ జలాల్లో ఉండే ఇనుప చువ్వలు తీసుకొని విక్రయించేవాడు. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా నీటిలో ఉండిపోయిన ఇనుపచువ్వలు తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు ఆ చువ్వల్లో చిక్కుకొని మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో ఓ మృతదేహం తేలియాడుతుండగా పోలీసులు బయుటకు తీయించారు. మృతుడు పవన్‌కుమార్‌గా గుర్తించి, పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరో మృతదేహం వెలికితీత...
హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మరో మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు సోమవారం వెలికి తీయించారు. సంజీవయ్యపార్కు వెనుకవైపు గల సాగర్ జలాల్లో ఓ మృతదేహం తేలియడుతుండగా బయటకు తీశారు. మృతుడికి 25- 30 ఏళ్లుంటాయని, ఒంటిపై ఆకుపచ్చ టీషర్ట్, నలుపు జీన్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధీకులు 9490157553 సెల్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.