కాంగ్రెస్ హటావో.. దేశ్ కో బచావో: పవన్ కళ్యాణ్
నా పార్టీ పేరు 'జనసేన' అని నోవాటెల్ హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కారణంగానే తనకు ఇష్టమైన అన్నయ్యకు ఎదురుగా నిలబడాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలది ఊసరవెల్లి మనస్తత్వమని, వైఎస్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు..వైఎస్ లేనప్పుడు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. గుండెల నిండా దమ్ము, ధైర్యం ఉన్నాయని, ఎలాంటి దౌర్జన్యం, అవినీతినైనా ఎదుర్కొంటామన్నారు.
సీమాంధ్ర ప్రజల, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే ఉరుకోనని పవన్ స్పష్టం చేశారు. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేయను.. అది నా సంస్కారం అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో జైరాం రమేశ్ వ్యవహార తీరుపై తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తీరు కూడా సరిగా లేదన్నారు.
షిండే, చిదంబరం, జైరామ్ రమేశ్, వీరప్ప మొయిలీ, ఆహ్మద్ పటేల్, ఆంటోనిపై మండిపడిన పవన్ కళ్యాణ్ .. కాంగ్రెస్ హటావో.. దేశ్ కో బచావో అంటూ నినాదాన్ని ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం ఆయన సారధ్యంలో జరిగి ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమయ్యేదని.. ఇరు ప్రాంతాల వారు స్వీట్లు పంచుకునే వారని వ్యాఖ్యలు చేశారు.