పవన్ జనసేన మైక్ కట్టేశాడా?
పవన్ జనసేన మైక్ కట్టేశాడా?
Published Thu, Apr 10 2014 1:02 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
ఊహాకందని ఉరుములు, మెరుపులు, కొంత ఆవేశం, కొంచెం హాస్యం ఇవన్ని జనసేన నేత, టాలీవుడ్ లో పవర్ స్టార్ గా సుపరిచితులైన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అంశాలు. ఉన్నట్టుండి ఆవేశ పడటం, వెంటనే ఎవరైనా ఏమైనా అనుకుంటారో అనే అనుమానంతో కొంత తగ్గడం... ఉన్న చోట ఉండకుండా.. కెమెరాకు కూడా బంధించలేని విధంగా ఊగి తూగడం పవన్ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే ఉంది ఆయన ప్రసంగ తీరు. ఇంతకీ ఈ వ్యవస్థ మీద కోపం ఎందుకొచ్చిందంటే .. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తీరు ఆయనకు నచ్చలేదట. అంతే ఆయన కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఓ స్టార్ హోటల్ లో సభ పెట్టి కడిగేసి... జనసేనను ప్రజల ముందుకు తెచ్చాడు.
అప్పటికి ఫస్ట్ షెడ్యూల్ ఫినిషైంది.
ఆతర్వాత సెకండ్ షెడ్యూల్ ను విశాఖలో పెట్టి నిర్మాత భారీగానే సీన్ రక్తికట్టించాడు. కాని ప్రధాన పాత్రధారి తీరే ఆకట్టుకోలేకపోయింది. జనాల్ని ఎందుకు పిలిచారో.. ఏం చెప్పుకోవాలనుకున్నాడో.. ఆయనకు అర్ధం కాలేదు... కనీసం చెప్పలేకపోయినా.. పవన్ కళ్యాణ్ తన మిత్రుడి సహకారంతో రాసుకున్న ఇజమ్ కూడా చెప్పలేకపోయింది. పవన్ ఇజంపై తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన సోదరుడు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు చిరంజీవే.. పవన్ సిద్దాంతాల్లో ఏ ఇజమ్ లేదు అని వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ కు వచ్చిన సందేహమే ఇతర సెలబ్రిటీలు, సగటు పౌరుడిలో కూడా కనిపించింది.
దాంతో సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయింది.
ప్యాచ్ వర్క్ మిగిలిపోవడంతో ఓ దిన పత్రిక, ఓ ఛానెల్లో అరువు తెచ్చుకున్న గొంతుతో ఎదుటివారిపై నాలుగు రాళ్లు విసిరి అయిపోయిందనిపించారు పవన్ కళ్యాణ్. ఆతర్వాత నుంచి జనసేన మైక్, పవన్ గొంతు మూగపోయింది. రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ఎజెండా అయితే కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన మైక్ ఎందుకు మూగపోయిందో సామాన్య ఓటరుకు అర్ధం కావడం లేదు. మోడీయే మన ప్రధాని.. ఇరుప్రాంతాల అభివృద్ది సాధ్యమంటూ లెక్చర్ దంచేసిన ఆయన ప్రజలకు కనిపించడం మానేశారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ టన్నుల కొద్ది ఆవేదన కురిపించిన పవన్ గారు.. మళ్లీ మీ నిర్మాత మీ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పాలి. పరోక్షంగా ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్ గా కాకుండా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మీరు నమ్మే చె గువెరా.. కొమరం భీమ్, ఆజాద్ భగత్ సింగ్ లాంటి ఓసారి తల్చుకో.. సమస్యలపై వాళ్లు అడపాదడపా స్పందించలే... నిరంతర పోరాటం చేశారని కొంచెం తెలుసుకోండి సార్...
Advertisement