* జన సేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పిలుపు
* ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో ఇప్పుడే చెప్పలేను
* కాంగ్రెస్ తప్ప ఏ పార్టీతోనైనా కలసి పనిచేయడానికి సిద్ధం
* చట్టం అందరికీ సమానంగా పనిచేయాలన్నదే మా సిద్ధాంతం
* కాంగ్రెస్ హైకమాండ్ వల్లనే అన్నయ్యకు ఎదురెళ్లాల్సి వస్తుంది
* తలుపులు మూసి విభజన దారుణం
* వ్యక్తిగత విమర్శలు చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా
* ఎకరాకు కోటి ఎలా సంపాదిస్తారో అందరికీ చెప్పాలి
* జాగృతికోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరు ‘‘జనసేన’’గా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని దేశంనుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో’ అంటూ తన ఎజెండాను వేదిక నుంచి నినదించారు. కానీ ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో పోటీ చేసే విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ముఖ్యమైన అభిమానుల మధ్య పవన్ కల్యాణ్ రాజకీయ ప్రకటన చేశారు. తెల్లటి ప్యాంట్, లేత గోధుమ రంగు చొక్కా, గడ్డంతో సాయంత్రం ఏడు గంటల సమయంలో సభా వేదికపైకి వచ్చి తొమ్మిది గంటల వరకు తన ప్రసంగం కొనసాగించారు.
ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠం కాగితాలను మధ్యమధ్యలో చూస్తూ హావభావాలను ప్రదర్శించారు. ఆవేశం... అనుభవాలు... నవ్వు... రంగరించి ప్రసంగం ఆసాంతం నాటకీయతను రక్తికట్టించారు. వాడివేడి మాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని.. వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తో తప్ప ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సినిమాలను పూర్తి చేస్తానని, ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
పార్టీ ఎందుకు పెట్టానంటే...
తండ్రిలాంటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను? ఢిల్లీలో కూర్చొన్న కాంగ్రెస్ హైకమాండే దీనికి కారణం. నేనేదో సినిమాల్లో వచ్చీరాని డ్యాన్సులు చేసుకుంటుంటే.. పార్టీ పెట్టేలా చేశారు. నిర్దిష్ట ఆలోచనలతో, పాతికేళ్ల లక్ష్యంతో మీ ముందుకు వచ్చా. పార్టీ పెట్టాను. దానిపేరు ‘జనసేన’. గతంలో నేను ఏర్పాటుచేసిన సీపీఎఫ్ (కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్)నుంచే జనసేన ఆవిర్భవించింది.
చట్టం అందరికీ సమానంగా పనిచేయాలన్నదే జనసేన పార్టీ సిద్ధాంతం. ఎలాంటి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉన్నా నిర్మూలిస్తాం. స్త్రీ రాత్రి వేళ కాకపోయినా కనీసం పట్టపగలు అయినా క్షేమంగా బయటకు వచ్చి తిరిగి వెళ్లేలా వచ్చే సమాజాన్ని స్థాపిస్తా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం.
జంపింగ్ జోకర్స్‌కు నా దగ్గర చోటులేదు. వాళ్లంటే నాకు చిరాకు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన టీఆర్‌ఎస్ నాయకుల మీద గౌరవం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన వెళ్లిపోయాక మరోలా మాట్లాడే కాంగ్రెస్ నేతలు నచ్చరు. వాళ్లను క్షమించను.
కొందరు కాపు నాయకులు రాజకీయంగా నాకు మద్దతు ఉండదని ప్రకటనలు చేశారు. మీరెవరు ఆ మాట చెప్పడానికి? నేనొచ్చి మిమ్మల్ని మద్దతు అడిగానా? నాకు కులం, మతం. ప్రాంతం లేదు. నేను భారతీయుడ్ని.
కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవ రితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలున్నాయి. ప్రతీ ఒక్కరితో సంప్రదించిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తా.
రాష్ట్ర విభజనపై...
రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్ లేవనెత్తిన న్యాయపరమైన అంశాలను ముందే అర్థం చేసుకొని ఉండుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేదికాదు. 2009 తర్వాత రాజకీయ నేతల నీచపు పనుల వల్ల సామాన్యులు కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. ఐదేళ్లు మిన్నకుండి పార్లమెంటు ఆఖరి సమావేశాల్లో హడావుడిగా కేవలం 23 నిమిషాల్లో సభ తలుపులు మూసేసి విభజన చేయడం దారుణం.
సోనియాగాంధీగానీ, కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ, పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన బొత్స సత్యనారాయణనైనా సొంత జిల్లాకు వచ్చి విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పగలరా?
కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు ఆ పార్టీ నేత జైరాం రమేష్ వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. విభజనపై ఆయన సీమాంధ్రలో ఒకలా.. తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారు. నిలకడలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమే దిగ్విజయ్‌సింగ్. కాంగ్రెస్ పెద్దలైన జైరాం, దిగ్విజయ్, షిండే, చిదంబరం తదితరులంతా జనసేన వచ్చిందని గుర్తించాలి.
పవన్ మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నాడనీ, మా రాహుల్ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ నాపై వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ పెళ్లి చేసుకోలేదన్నాడు కానీ బ్రహ్మచారని మాత్రం చెప్పలేదు. ఏ పరిస్థితుల్లో నేను మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వారికేం తెలుసు. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవర్నీ వదలను. రాహుల్ నుంచి ప్రతి ఒక్కరి బాగోతాలు బయట పెడతాను.
కేసీఆర్ కుటుంబంపై విసుర్లు...
తగలబెట్టండి, నాలుకలు కోస్తాం, అడ్డంగా నరికేయండి అనే పదజాలం తెలంగాణ మాండలికం కాదు. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే అది ప్యూడలిస్టు భావజాలం. ఎకరాకు కోటి రూపాయలు ఎలా సంపాదించారో (కేసీఆర్‌నుద్దేశించి) ప్రతి ఒక్కరికీ చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. నన్నయ్య ఎక్కువా? సోమనాథుడు ఎక్కువా? అన్నది మనకొద్దు. ఎవరి ప్రాంత అభివృద్ధిపై వారు దృష్టి పెట్టండి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాపై విమర్శలు చేశారు. పార్టీ పెట్టి తెలంగాణకు క్షమాపణ చెప్పాలంట.. తెలంగాణ ప్రజలే నా వాళ్లయినపుడు వారికి నేను క్షమాపణ చెప్పేదేంటి? అమ్మా... కవితా.. నీవు నా చెల్లెలులాంటి దానివి. నీ వేదనను అన్నయ్యలా అర్థం చేసుకున్నా. తెలంగాణ జాగృతికోసం దేశ విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయో వెల్లడించు.
ఆర్నెల్ల కిందే ‘జనసేన’ కోసం దరఖాస్తు: బాల్‌రాజ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటుకు ఆరు నెలల క్రితమే ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేశామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.బాల్‌రాజ్ ముదిరాజ్ వెల్లడించారు. తాము దరఖాస్తు చేసుకున్న విషయంపై ఎలాంటి సమాచారం తీసుకోకుండా సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
కాంగ్రెస్, బీజేపీలకు సహకరించేందుకే.. పవన్ పార్టీపై రాఘవులు వ్యాఖ్య
సాక్షి, తిరుపతి: కాంగ్రెస్, బీజేపీలకు సహకరించేందుకే పవన్ పార్టీ పెడుతున్నట్లు సందేహాలున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పెట్టేవారికి ప్రజాసంక్షేమ దృక్పథం ఉండాలన్నారు. ఇంత తొందరగా పవన్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో: పవన్ కల్యాణ్
Published Sat, Mar 15 2014 1:55 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement