
సాక్షి, అమరావతి: ఇది పార్ట్‌నర్స్ వేసిన మరో ప్లాన్..! ఒకవైపు.. ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి తేరుకునే ఛాయలు ఏమాత్రం కానరాకపోవడం మరోవైపు.. అమరావతిలో లక్షల కోట్ల రూపాయల తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి తన ‘పార్టనర్’ను తెరపైకి తెచ్చారు. ఆర్థిక, రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో జట్టు కట్టేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ద్వారా స్కెచ్ వేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు – పవన్ కల్యాణ్ జోడీ మరో పన్నాగం పన్నింది. పవన్ ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖను అమరావతి పోరులోకి దించే ఎత్తుగడ వేసింది.
బాబు ప్రయోజనాలే పవన్‌కు పరమావధి!
ముందస్తు స్కెచ్ ప్రకారం పవన్ కల్యాణ్‌ను మరోసారి రంగంలోకి దింపిన చంద్రబాబు ఆయన్ను ఢిల్లీకి పంపి రెండు రోజులు మకాం వేయించారు. సుజనా చౌదరి తదితరుల సహకారంతో పవన్ బీజేపీ నేతలను కలిసేలా చేశారు. బాబు స్క్రిప్టు ప్రకారం బేషరతుగా బీజేపీతో కలసి పనిచేసేందుకు పవన్ సమ్మతించారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని పవన్ కనీసం అడగకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ కోసం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటామని విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ పదే పదే చెప్పడం వారి అసలు ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుపై పవన్, కన్నా పరస్పర విరుద్ధంగా మాట్లాడి ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి తెరతీశారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడటమే తమ విద్యుక్త ధర్మం అన్నట్టుగా వారిద్దరూ మాట్లాడారు.
దశలవారీ విలీనానికి గ్రీన్ సిగ్నల్?
పవన్ కల్యాణ్ తమతో బేషరతుగా కలసి పనిచేసేందుకు సమ్మతించారని గురువారం చర్చల సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పదేపదే చెప్పడం గమనార్హం. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడానికి వీల్లేదన్న ఆదేశానికి పవన్ సమ్మతించారు. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు రాష్ట్రంలో కాస్త బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇదే అదనుగా జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. అందుకు పవన్ కల్యాణ్ సూత్రప్రాయంగా సమ్మతించారని తెలుస్తోంది. ఒకేసారి విలీనం కాకుండా దశలవారీగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక నుంచి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ ధేవ్‌ధర్ నేతృత్వంలో రాష్ట్రంలో తాము పనిచేస్తామని ప్రకటించడం ద్వారా పవన్ అసలు ఉద్దేశాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment