జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్... కాపు రిజర్వేషన్లపై స్పందించారు.
►కాపులకు రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది
►రిజర్వేషన్ హామీ...ప్రత్యేక హోదా హామీలాంటిదే..
►అన్ని కులాల కోసం పని చేస్తా
►అంబేద్కర్ రిజర్వేషన్ల లేని సమాజం కోరుకున్నారు..
►మా అమ్మ కులాన్ని పెట్టుకుంటే మాకు రిజర్వేషన్ వచ్చేది
►ఏపీ నాయకులు వ్యక్తిగత అవసరాలకు రాజీ పడ్డారు
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్... కాపు రిజర్వేషన్లపై స్పందించారు. ఆయన శనివారం సోషల్ మీడియా బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కాపు రిజర్వేషన్ హామీ ...ప్రత్యేక హోదా హామీ లాంటిదే. కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వలేమని చెప్పండి. మభ్యపెడితే అశాంతికి కారణం అవుతుంది. ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఒక కులం కోసం నేను పని చేయను. ప్రతి కులాన్ని గౌరవిస్తా. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపే హక్కు పోలీసులు, ప్రభుత్వానికి లేదు. ఆయనను అడ్డుకోవడం శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తోంది. అంబేద్కర్ రిజర్వేషన్లు లేని సమాజం కోరుకున్నారు.
మా అమ్మ బీసీ (బలిజ)... మా నాన్న అగ్రకులం. మా అమ్మ కులాన్ని పెట్టుకుంటే మాకు రిజర్వేషన్ వచ్చేది. క్రిమీలేయర్ విధానాన్ని పెట్టాలి. రాజకీయ నాయకులు, చదువుకోనోళ్లు.. అందుకే విద్యకు ప్రాధాన్యం ఇవ్వరు. ఓ ఐపీఎస్ అధికారి సహాయంతో పూర్ణ ఎవరెస్ట్ ఎక్కగలిగింది. అవసరమైతే పాఠాలు ఉన్నాయి కానీ... పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే పాఠ్యాంశాలు లేవు.
నాణ్యమైన విద్య కావాలంటే టీచర్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. మద్యం మీద కంటే విద్య మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. తెలంగాణ నాయకులు సమిష్టిగా పోరాడితే.. ఏపీ నాయకులు వ్యక్తిగత అవసరాల కోసం రాజీపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేశారనడం కాదు. రాష్ట్రానికి కావాల్సిన వాటిపై మీరేం చేశారో ప్రశ్నించుకోండి. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసేముందు మనం ఏం చేశామో ఆలోచించుకోండి.’ అని వ్యాఖ్యానించారు.