పవన్ మాటల వెనుక....
హైదరాబాద్: ఓటుకు కోట్ల కుంభకోణం కేసులో త్వరలో నోరు విప్పుతా... విప్పుతా అంటూ ఊరించి, ఉడికించిన సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నోరు విప్పనే విప్పారు. మాటకు మాట పొంతన లేకుండా, మాట్లాడుతున్న సందర్భానికి, చెబుతున్న ఉదాహరణకు సమన్వయం లేకుండా ఎవరికీ ఏమీ అర్థం కాకుండా జాగ్రత్త పడ్డట్టు కనిపించారు.
కాసేపు నరేంద్ర మోదీతో భేటీ గురించి, అంతట్లో ఆంధ్ర ఎంపీల అలసత్వం గురించి, తెలంగణ త్యాగధనులు ఫలితం తెలంగాణ అంటూ, ఆంధ్రకు అన్యాయం జరిగిందంటూ, మరి కాసేపు తెలుగు ప్రజల సమైక్యతను కోరుకుంటున్న నిజమైన తెలుగువాడు కేసీఆర్ అని ప్రశం సిస్తూ... సెక్షన్ 8 వద్దే వద్దు, ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఇద్దరు లేక ముగ్గురు, ముగ్గురు లేక ఐదుగురితో కమిటీ వేయాలని....ఇలా, అలాని ముందుగా స్క్రీన్ ప్లే రాసుకోకుండా తెరమీదకు వచ్చిన నటుడిలా మాట్లాడి వచ్చిన పని అయిందనిపించారు. కానీ ఆయన మాటల తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే తన ఎజెండా ఏమిటనే విషయాన్ని స్పష్టంగానే చెప్పారు.
ఓటుకు కోట్లు కేసులో రేవంతి రెడ్డి గురించి ఒకటి రెండు సార్లు మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్... నేటి సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఇలాంటి అవినీతి సర్వ సాధారణమేనని, దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని పదే పదే చెప్పారు. తెలంగాణ, అంధ్రకు పదేళ్లపాటు హైదరాబాదే రాజధాననీ చెప్పారు.
సెక్షన్ 8కు తాను పూర్తిగా వ్యతిరేకినంటూ, సెక్షన్ 8ను అమలు పరిస్థితులు తీసుకరావద్దని తాను కోరుకుంటున్నానని అన్నారు. అంటే గతంలో చంద్రబాబు హెచ్చరించినట్టుగానే ఓటుకు కోట్లు కేసులో ముందుకెళితే ఆ పరిస్థితి రానే వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ముక్కుసూటిగా మాట్లాడలేని తన డొల్లతనాన్ని తెలివిగా తప్పించుకునేందుకు తన మాటలను ఎలాగైనా రాసుకునే స్వేచ్ఛ మీడియాకు ఉందని ముక్తాయించారు. ఎవరు ఎలా రాసినా ‘అబ్బే నా ఉద్దేశం అది కానే కాదు’ అని సమర్థించుకునేందుకు ముందు జాగ్రత్త పడ్డారు. మీడియాకు కూడా తనకు నచ్చిన అర్థంలో పవన్ ప్రసంగాన్ని రాసుకునేందుకు అవకాశం ఇచ్చారు.