నా తెలంగాణ పోరు తెలంగాణ: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. తన పార్టీ పేరు 'జనసేన'గా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దేవరకొండ బాల గంగాధర్ తిలక్ వాక్యాలతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
'ఇల్లేమే దూరం.. అసలే చీకటి.. చేతిలో దీపం లేదు.. చేతిలో కర్ర లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పోరాడాలన్న ఆత్మవిశాసం ఉంది. ఎలాంటి అవినీతినైనా తరిమి కొడతాం. గొప్పగా బతకాలని ప్రయత్నం చేయలేదు. సామాన్యుడిలా బతకాలనుకున్నా. దేశంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యతో రాజకీయాల్లోకి వచ్చా. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదు. అన్నయ్య చిరంజీవిపై నాకు కోపం ఉండదు. ఆయనను ఎదుర్కొవడానికి పార్టీ పెట్టడం లేదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి. నా తెలంగాణ పోరు తెలంగాణ. రాష్ట్రాన్ని ఎలా విడగొట్టారో, ఎలాంటి పరిస్థితుల్లో చూశాను. అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. రాజకీయ నాయకులపై అసహ్యం వేసింది.
నేను రాజకీయాల్లోకి వస్తున్నానని అనగానే చాలా మంది విమర్శించారు. నా తెలంగాణకు క్షమాపణ అడగడానికి మీరెవరు. పార్టీ పెట్టు ముందు క్షమాపణ చెప్పు అనడానికి మీరెవరు. నేనెవరికీ భయపడను. ఎవరికీ వెన్నుచూపను. పిరికితనం అంటే నాకు చిరాకు. నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అనేది నా వ్యక్తిగత విషయం. నేను తెలంగాణకు అనుకూలం. అదే సమయంలో సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించను.
చిన్నప్పుడు నాకు చిన్నప్పుడే సామాజిక స్పృహ కలిగింది. చిన్నప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకం చదివాను. నా గుండెల్లో ఉన్న కామన్మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జనసేన మారింది. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కారించడానికే, జటిలం చేయడానికి కాదు. చాలా మంది నాయకులు డబ్బు సంపాదనలో బిజీగా ఉన్నారు.
నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే సహించను. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగితే ఆమోదిస్తారా. నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే రాహుల్ గాంధీ నుంచి ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితాలను బయటకు తీస్తాను. నాకూ అభిమానులున్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహారాలు యూట్యూబ్లో పెట్టెస్తా. సిన్మాలు వదులుకోవాలని, అభిమానులను దూరం చేసుకోవాలని లేదు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.