సాక్షి, అనంతపురం : ఆధార్ నంబరు అనుసంధానం చేయించుకోని ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపు ఆపేశారు. దీంతో కూలి డబ్బులు చేతికి అందితే తప్ప కడుపు నిండని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో దాదాపు మూడు వేల మంది కూలీలు ప్రతి రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులు కూలి పనులకు వెళ్తే అందులో సగం మందికి వేతనం వచ్చి మరో సగం మందికి సకాలంలో అందడం లేదు. ఆధార్ కార్డును అనుసంధానం చేసిన కూలీలకు మాత్రమే డబ్బులు చెల్లించి...లింక్ చేయించుకోని కూలీలకు వేతనాలు ఇవ్వడ ం లేదు.
దీంతో చాలా చోట్లా గ్రూపులో వున్న సభ్యులందరికీ ఒకే సారి వేతనాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు అనే రీతిలో కూలీలు పట్టుపడుతున్నారు. ఈ కారణంగా గ్రూపులో సగం మందికి వచ్చిన డబ్బును తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. కూలీలు 15 రోజుల్లోపు వేతనాలు తీసుకోక పోతే ఆ మొత్తాన్ని తిరిగి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు జమ చేయాల్సి ఉంటుంది. జమ చేసిన మొత్తం మళ్లీ డ్రా చేయాలంటే జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తప్పని సరి కావడంతో చాలా మంది కూలీలకు నెలల తరబడి వేతనాలు అందని వారు కూడా ఉన్నారు.
ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించేందుకు వీలుగా జిల్లాలో రూ.31 కోట్లు బ్యాంకు అకౌంట్లలో మగ్గుతున్నాయి. ఆ మొత్తాన్ని సకాలంలో కూలీలకు మంజూరు చేసే విషయంలో మండల స్థాయి అదికారులు ఆశ్రద్ధ చూపడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉపాధి పనులకు వెళ్లేకంటే వ్యవసాయ పనులకు వెళ్తే ఏరోజుకారోజు వేతనం చేతికి అందుతుందని గార్లదిన్నెకు చెందిన లక్ష్మమ్మ తెలిపింది.
వేతనాలు ఆలస్యం కానివ్వం
పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించే విషయంలో ఆలస్యం కానివ్వం. డబ్బు కొరత లేదు. ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పటికప్పుడు మంజూరవుతున్నాయి. కూలి అందలేదని ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 15 రోజులుగా వేతనాలు అందని కూలీలు ఎవరైనా వుంటే ఆ వివరాలు నా దృష్టికి తీసుకురండి. పనులు కావాలని అడిగే వారికి వెంటనే పనులు కూడా కల్పిస్తాం.
-సంజయ్ ప్రభాకర్, పీడీ, డ్వామా
‘ఉపాధి’ చెల్లింపులకూ ఆధార్ లింక్
Published Fri, May 23 2014 1:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement