అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. చనిపోయిన వారి వివరాలు రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఉపాధి నిమిత్తం శాశ్వతంగా వలసపోయిన వారి వివరాలనూ సేకరించడం లేదు. దీంతో వీరి పేరిట నేటికీ పింఛన్ మంజూరవుతూనే ఉంది. వీరందరూ క్రమం తప్పకుండా డబ్బు పొందుతున్నట్లు రికార్డుల్లో చూపి.. పింఛన్ పంపిణీ చేసే సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్)లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నొక్కేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ యంత్రాలు సరిగా పనిచేయకపోయినా.. పని చేస్తున్నట్లు చూపుతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, మునిసిపాలిటీల్లో 4,08,645 మంది లబ్ధిదారులు ప్రతి నెలా సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్నారు.
వీరిలో 2,37,320 మంది వృద్ధులు, 10,929 మంది చేనేత కార్మికులు, 95,697 మంది వితంతువులు, 16,781 మంది అభయ హస్తం లబ్ధిదారులు, 47,782 మంది వికలాంగులు, 136 మంది గీత కార్మికులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా 53 మండలాల్లో స్మార్‌టకార్డుల ద్వారా సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్)లు పంపిణీ చేస్తున్నారు. మిగతా 10 మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులే పింఛన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో చనిపోయిన, వలస వెళ్లిన వారికి సంబంధించిన పింఛన్ డబ్బును సీఎస్పీలు, పంచాయతీ కార్యదర్శులు దొంగ సంతకాలు, వేలిముద్రలతో డ్రా చేసుకుంటున్నారు.
కొండంత దోపిడీ.. గోరంత రికవరీ
పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన ‘సాట్’ అనే సంస్థ ద్వారా జిల్లాలో సామాజిక తనిఖీలు నిర్వహించింది. మూడు విడతలుగా జరిగిన ఈ తనిఖీల్లో పింఛన్ పంపిణీ అక్రమాల గుట్టు వెలుగులోకి వచ్చింది. రూ.56.98 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. అధికారులు అక్రమార్కుల నుంచి రూ.9.28 లక్షలు మాత్రమే రికవరీ చేశారు.
పంపిణీ అస్తవ్యస్తం
ప్రతి నెలా ఒకటో తేదీ ప్రారంభించి ఐదో తేదీ లోగా ముగించాల్సిన పింఛన్ల పంపిణీ ఆరు నెలలుగా సక్రమంగా జరగడం లేదు. బడ్జెట్ విడుదలలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యంతో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. క్షేత్ర స్థాయిలో వైఫల్యాల కారణంగా కూడా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకటో తేదీన పింఛన్ డబ్బు వస్తుందని ఎదురుచూసే అభాగ్యులకు నిరాశే మిగులుతోంది. దీనికి తోడు ఎప్పుడిస్తారనే స్పష్టమైన తేదీలు ప్రకటించకపోవడంతో వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తపాలా, స్మార్టు కార్డు ఏజెన్సీల ద్వారా పంపిణీ నిర్వహిస్తున్నారు. పింఛన్లకు సంబంధించిన నిధులు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నుంచి ఆయా పంపిణీ ఏజెన్సీలు, అధికారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి ఉప తపాలా, కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)ల ప్రధాన ఖాతాల్లోకి.. ఇలా లబ్ధిదారులకు అందేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది.
వృద్ధుల అగచాట్లు
గ్రామంలో వంద మంది లబ్ధిదారులు ఉంటే సీఎస్పీల ద్వారా పింఛన్ అందజేస్తున్నారు. వందకు లోపు ఉంటే వారు సుదూర ప్రాంతానికెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. వృద్ధులు కిలోమీటర్ల దూరం నడవలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు వృద్ధుల చేతి వేళ్ల గీతలు ఒక్కోసారి స్మార్‌ట కార్‌డలో మ్యాచ్ కాకపోవడంతో పింఛన్ ఇవ్వకుండా సీఎస్పీలు వెనక్కు పంపుతున్నారు. స్మార్‌ట కార్డుల పరీక్ష నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని వృద్ధులు కోరుతున్నారు.
ఆత్మలకూ పింఛన్లు!
Published Wed, Dec 25 2013 1:52 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement