
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం కోసం 5 నెలలగా ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, వై.శ్రీనివాసులరెడ్డి, రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
కడప ఉక్కు రాయలసీమ హక్కు అని దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఖాళీగా ఉన్న 1.86 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే శాసనసభ, శాసన మండలి సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ విడుదల చేసిన జీవో నంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడులో ప్రాంతీయ భాషను తప్పనిసరి చేశారన్నారు.