
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
సారవకోట రూరల్: శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కరకట్ల నిర్మాణాలను పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సారవకోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను సింగపూర్ చేయనవసరం లేదని, పెంపింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే చాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారని, అయితే సగటు మానవునికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే చర్యలు చేపట్టాలన్నారు.
రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రజలను ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు తాత్సారం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు నిర్వహిస్తున్నారని ఇటువంటి చర్యలు మానుకోక పోతే సంఘటితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
గ్రామీణ క్రీడాకారులను గుర్తించాలి
గ్రామీణ క్రీడాకారులను గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో క్రీడల శాఖా మంత్రి ఉన్నా క్రీడాకారులకు తగిన గుర్తింపు లేదన్నారు. గ్రామస్థాయిలో అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని.. వారిని గుర్తించి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, కుమ్మరిగుంట ఎంపీటీసీ సభ్యురాలు చిన్నాల శైలజ ఉన్నారు.