తూర్పుగోదావరి
రాయవరం (మండపేట): ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీని ఏప్రిల్ ఒకటో తేదీనే ఆగమేఘాలమీద టీడీ పీ సర్కారు అందజేసి మే నెలలో మాత్రం మౌనం దా ల్చింది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు పూర్తవడంతో మే నెలతో మాకేమి సంబంధం అన్నట్టుగా వ్యవహరించడంతో లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. బ్యాంకుల నుంచి పింఛన్ల సొమ్ము పంచాయతీ కార్యదర్శులకు 30వ తేదీ నాటికి అందకపోవడంతో పింఛన్లు ఒక టో తేదీన ఇవ్వలేకపోయారు. ఒకటో తేదీన ‘మే’డే సెలవు దినం కావడంతో రెండో తేదీన బ్యాంకుల నుం చి డ్రా చేసి పంపిణీ చేస్తారేమోనని ఎదురు చూశారు. కానీ గురువారం కూడా ఆ జాడకానరాకపోవడంతో మూడో తేదీనైనా ఇస్తారేమోనని ఆశలు పెట్టుకున్నారు. పింఛన్ల సొమ్ము వేరే ఖాతాలకు ఎన్నికల ముందు టీడీపీ సర్కారు బదిలీ చేయడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
5.83 లక్షల మందికి పింఛన్లు...
జిల్లాలో 5, 83, 925 మంది వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లుగీత కార్మికులకు ప్రతి నెలా పింఛన్లు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వీరందరికీ రూ.123.73 కోట్లు అందజేస్తున్నారు. పింఛన్ల సొమ్మును ఒకటో తేదీన అందజేయాల్సి ఉంది. ఆయా మండలాల ఎంపీడీవో బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ఆ సొమ్మును పంచాయతీ కార్యదర్శులు డ్రా చేసుకుని లబ్ధిదారులకు అందజేస్తారు. ఇదీ పద్ధతి...ఏప్రిల్ నెల వరకు అలానే జరిగేది. ఎన్నికల అనంతరం ఈ సిస్టంకు బ్రేకుపడింది.
ఉదయం 6 గంటల నుంచే...
వేసవిని దృష్టిలో ఉంచుకుని పింఛన్లను ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ అధికారులు మండలాలకు, మండలాల నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీరు, మజ్జిగను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి అందజేయాలని కూడా సూచించారు.
శృంగవరంలో..
రౌతులపూడి (పత్తిపాడు): రౌతులపూడి మండలంలోని శృంగవరంలో పింఛన్ల పంపిణీ జరగలేదు. దీంతో ఉదయం నుంచీ పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరాశగా వెనుతిరిగారు. పింఛన్ల సొమ్ములు ఇంకా అందలేదని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని పంపిణీ అధికారి, వీఆర్‌ఓ రామకృష్ణ తెలిపారని గ్రామానికి చెందిన కనకదుర్గ వికలాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఉప్పలపాటి నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు.
రాజవొమ్మంగిలో,,,
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల పంపిణీ రెండో తేదీ గురువారం కూడా ప్రారంభం కాలేదు. మండలంలో మొత్తం 5,711 మంది పింఛదారులున్నారు. వారికి చెల్లించడానికి రూ.1,22,37,500 అవసరం. వీటిలో వృద్ధులు 2,979 మంది, వితంతువులు 2,202 మంది, వికలాంగులు 414 మంది, ఏబీహెచ్ (అభయ హస్తం) 103 మంది, చేనేత ఒకటి, ఒంటరి మహిళ పింఛనుదారులు 12 మంది ఉన్నారు. అడ్డతీగల మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకుంది.
బ్యాంకు నుంచి సొమ్ముఅందనందునే...
ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బు జమ చేసినట్లు సమాచారం ఉంది. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము అందక పోవడంతో ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం.– కేఆర్‌ఎస్ కృష్ణప్రసాద్, ఎంపీడీవో, రాయవరం
Comments
Please login to add a commentAdd a comment