ఫించన్‌దారుల వద్ద రూ.100 తీసుకుని టీడీపీ శ్రేణులు టీడీపీ సభ్యత్వం పేరుతో ఇస్తున్న రసీదు
సాక్షి, రాజమహేంద్రవరం : పార్టీ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ నూతన దందాకు తెరలేపింది. ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, డ్వాక్రా రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరి నుంచి సభ్యత్వం పేరుతో రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛనుదారుల నుంచి రూ.100 చొప్పున పింఛన్ నగదులో కోత విధించి రూ.900 చేతిలో పెడుతున్నారు. డ్వాక్రా రుణాలు కావాలంటే కచ్చితంగా సభ్యత్వం ఉండాల్సిందేనని, లేదంటే రాదంటూ మహిళల వద్ద రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.
సభ్యత్వ నమోదు పలు విధాలు..
ప్రతి పార్టీ తమ సానుభూతిపరులను పార్టీ సభ్యులుగా చేర్చుకుంటుంది. ఒక్కోపార్టీ ఒక్కోలా అందుకు ఫీజు నిర్ణయిస్తుంది. రెండేళ్లకోసారి టీడీపీ సభ్యత్వాలు నమోదు చేస్తోంది. 2016లో సభ్యత్వాలు తీసుకునే వారి నుంచి రూ.100 చొప్పున వసూలు చేసింది. తాజాగా ఆ గడువు ముగియడంతో మళ్లీ నూతన సభ్యత్వాలు చేయాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలోని తమ్ముళ్లు నెల రోజుల నుంచి పని మొదలెట్టారు. కార్తిక మాసం ప్రారంభం తర్వాత నియోజకవర్గాల వారీగా టీడీపీ వన సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ సభ్యత్వం ఉండాలని, అందు కోసం రూ.100 చెల్లించాలని డ్వాక్రా మహిళల వద్ద వసూలు చేశారు. సభ్యత్వం తీసుకోకపోతే కొత్త రుణాలు రాబోవని హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు అయిష్టంగానే రూ.100 చెల్లించారు. తాజాగా ఈ నెల ఒకటో తేదీ నుంచి పింఛన్లు పింపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి రూ.100 కోత పెట్టి మిగతా నగదు ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న వారికి సభ్యత్వం కోసమని, ఇది తీసుకోకపోతే పింఛన్ రాదని, రేషన్ బియ్యం కూడా రావని మభ్యపెడుతున్నారు. రాజమహేంద్రవరం నగరంలో పలు డివిజన్లలో ఈ దందా సాగుతోంది. రెండో డివిజన్, 6వ డివిజన్‌లో టీడీపీ నాయకులు పింఛన్‌దారుల నుంచి సభ్యత్వం పేరుతో నగదు వసూలు చేసి రసీదు చేతిలో పెడుతున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు రావాలంటే రూ.100 చెల్లించాలని ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి వసూలు చేస్తున్నారు.
జిల్లాలో రూ.9.5 కోట్ల వసూళ్లు...
2016లో నియోజకవర్గానికి 25 వేల సభ్యత్వాలు లక్ష్యంగా ఇవ్వడంతో అప్పుడు కూడా డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారుల నుంచి సభ్యత్వాలు పేరుతో రూ.100 చొప్పున వసూలు చేశారు. అందుకు సంబంధించిన కార్డులు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ఈసారి సభ్యత్వాల సంఖ్య 50 వేలకు పెంచారని టీడీపీ నేత ఒకరు తెలిపారు. పంచాయతీ, డివిజన్‌లో జనాభా ఆధారంగా పార్టీ శ్రేణులకు లక్ష్యాలు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 19 నియోజకవర్గాలకుగాను 9.5 లక్షల సభ్యత్వాలను చేర్పించాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని పేర్కొన్నారు. ఒక్కో సభ్యత్వం విలువ రూ.100 చొప్పున రూ. తొమ్మిదిన్నర కోట్లు జిల్లా నుంచి టీడీపీ కార్యాలయానికి చేరనుంది. ఇందుకోసం తెలుగు తమ్ముళ్లు డ్వాక్రా మహిళలు, ఫించన్‌దారులు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 80 ఏళ్ల వృద్ధుల వద్ద కూడా రూ.100 వసూలు చేస్తున్నారు.
వృద్ధుల కడుపు కొడుతున్నారు
టీడీపీ సభ్యత్వం పేరుతో వృద్ధులు, వికలాంగుల వద్ద రూ.100 వసూలు చేస్తున్నారు. పింఛన్ నగదు నగరపాలక సంస్థ ఇవ్వగానే వారి పక్కనే కూర్చుని ఉన్న టీడీపీ నేతలు వారి చేతిలోని రూ.1000 తీసుకుని, తిరిగి రూ.900 ఇస్తున్నారు. కొందరికి రసీదులు ఇస్తున్నారు. మరికొంత మందికి ఇవ్వడం లేదు. సభ్యత్వం ఉంటేనే పింఛన్ వస్తుందని చెబుతున్నారు.
– బురిడి త్రిమూర్తులు, వైఎస్సార్‌సీపీ 6వ డివిజన్ ఇన్‌చార్జి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment