‘ప్రత్యేక హోదా’ పై ప్రజలను చైతన్యం చేయండి
- వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘ప్రత్యేక హోదా అంశాన్ని సీరియస్‌గా తీసుకోండి. హోదాపై వైఎస్సార్‌సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలను చైతన్యం చేసేలా, హోదా దక్కకపోతే వారికి జరగబోయే నష్టం వారు తెలుసుకునేలా ఉండాలని’ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు గురువారం హైదరాబాదులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు.
ఈ నెల 26 నుంచి గుంటూరులో ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెడుతున్న నిరాహార దీక్షకు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి పౌరుడు తనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించేలా చేయాలని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.