ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
గండేపల్లి : రుణమాఫీని తప్పక చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం ప్రకటించారు. శుక్రవారం మండలంలోని మురారి జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందని అయినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు.
గత యూపీఏ ప్రభుత్వంలో రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేయగా, రాష్ట్రంలో 13 జిల్లాలకు కలిపి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్ల రుణమాఫీకి ముందుగా 20 శాతం ఇచ్చి, మిగిలిన 80 శాతానికి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ చైతన్యరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పి.చిట్టిబాబు, ఎంపీపీ డి.సుశీల, వైస్ ఎంపీపీ పోతుల మోహనరావు, జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ బులి వీరమ్మ, కందుల కొండయ్యదొర, గోదావరి డైయిరీ చైర్మన్ కొడాలి చంటిబాబు, జ్యోతుల చంటిబాబు, ఎస్‌వీఎస్ అప్పలరాజు, ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ కె. రమేష్, తహశీల్దార్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 36 కొత్త పింఛన్లు అందజేశారు.
బ్యాంకు సేవలను సద్వినియోగపర్చుకోవాలి
బ్యాంకు సేవలను సద్వినియోగపరచుకోవాలని గండేపల్లి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ కొక్కిరి మహాలక్ష్మి జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులకు తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు.
పింఛను లబ్ధిదారుల ఇబ్బందులు
ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.