కాకినాడ జీజీహెచ్ ఓపీ బ్లాక్ వద్ద క్యూలో నిలబడిన రోగులు, వారి సహాయకులు
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాట ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. దవాఖానాల దుస్థితికి నిత్య దర్పణం ఆ పాట. దానిని దాదాపు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర వింటున్నా.. ప్రభుత్వాల కళ్లు తెరచుకోవడంలేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు నేటికీ అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు.
అరకొర వైద్య సేవలు, చాలీచాలని వసతులు, సౌకర్యాల లేమి, మందుల కొరత.. ఇలా అనేక సమస్యలు సర్కారీ ఆసుపత్రులను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో ఇటువంటివే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి. దీంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని విభాగాలకైతే డాక్టర్లు లేక వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఇక కొన్ని విభాగాల్లో ఒకే మంచంపై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్న దుర్భర పరిస్థితి నెలకొంది.
పేద రోగులకు అందించాల్సిన మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.∙కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) బోధనాసుపత్రి కూడా. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది.
అనేక విభాగాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కీలకమైన కార్డియాలజీ విభాగానికి పూర్తిస్థాయి వైద్యులు లేరు. ప్రస్తుతం గుండె వ్యాధుల చికిత్స నిపుణునిగా సేవలందిస్తున్న డాక్టర్ చలం మూడు రోజులు కాకినాడ జీజీహెచ్‌లో, మూడు రోజులు విశాఖ కేజీహెచ్‌లో సేవలు అందిస్తున్నారు.
దీంతో ఇక్కడ అరకొర వైద్యసేవలే దిక్కవుతున్నాయి. ప్రధానమైన బీ కాంప్లెక్స్ నుంచి గుండె జబ్బులు, న్యూరాలజీ, కీళ్లనొప్పులతోపాటు కాల్షియం మాత్రలు కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. చెవి, కంటికి సంబంధించి వేసే డ్రాప్స్ కూడా మూడు నాలుగు నెలలుగా సరఫరా కావడంలేదు.
ఆసుపత్రి డ్రగ్స్ బడ్జెట్ రూ.1.82 కోట్లు. ఇది ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు.∙రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఓపీ చీటీలు రాసేచోట సరైన సిబ్బంది లేరు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిని పారిశుద్ధ్య సిబ్బందిగా, ట్రైనీ నర్సులుగా నియమిస్తుంటారు.
ఇక్కడ పని చేస్తున్న 69 మందిని ఒకేసారి బదిలీ చేయడంతో పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. ఒకేసారి సీనియర్ సిబ్బందిని బదిలీ చేయడంతో గైనిక్ వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డెలివరీ కూడా సకాలంలో చేయడం లేదని రోగులు వాపోతున్నారు.
ఏడాదికి రూ.1.62 కోట్ల మేర డ్రగ్స్ బడ్జెట్ కేటాయించినా అది చాలడంలేదు. దీనిని రూ.3 కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది.∙అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కన్ను, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వైద్యం అందే పరిస్థితి లేదు. కోనసీమలోని కిడ్నీ రోగులను ఈ ఆసుపత్రి ఆదుకోలేకపోతోంది.
డయాలసిస్ యూనిట్ లేక కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మందుల కొరత ఉంది. దాదాపు రూ.70 లక్షల బడ్జెట్ అవసరం కాగా, కేవలం రూ.51.52 లక్షల మేరకే ప్రభుత్వం ఇస్తోంది.
∙తుని ఏరియా ఆసుపత్రిలో చీటీలు తీసుకున్న రోగులు సంబంధిత డాక్టరు గది వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడ మూడు ఎక్స్‌రే మెషీన్లు ఉండగా ఒకటి మాత్రమే పని చేస్తోంది. నెలలు నిండిన మహిళలు పురుడు కోసం వస్తే చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు.
డ్రగ్స్ కొరత ఉంది.
ప్రభుత్వం కేటాయించిన రూ.52.65 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.75 లక్షల మేర అవసరం ఉంది.∙మూడు నియోజకవర్గాలకు ఏరియా ఆసుపత్రిగా ఉన్న రామచంద్రపురంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సహితం ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది.
గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, చంటిపిల్లల వైద్యులు లేకపోవటంతో మహిళా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గుండెపోటుకు గురైనవారికి అత్యవసర చికిత్స అందించే పరిస్థితి లేదు. ముఖ్యమైన సామగ్రి అందుబాటులో లేకపోవటంతో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు అవసరమైన వారిని కాకినాడ తరలిస్తున్నారు.
ఈ ఆసుపత్రికి ఏటా రూ.35.80 లక్షల మేర డ్రగ్స్‌కు కేటాయిస్తున్నా సరిపోవడం లేదు. మందుల కొరత తీరాలంటే రూ.55 లక్షల మేరకు అవసరం ఉంది. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొందిగొంతుకు ఎక్స్‌రే తీయమంటే చెస్ట్‌కు తీశారుకాకినాడ జగన్నాథపురానికి చెందిన 12 ఏళ్ల రాముడుకు గొంతులో కాయ ఏర్పడింది.
శనివారం ఎక్స్‌రే తీయాల్సిందిగా వైద్యులు సూచించారు. తీరా అన్నీ చేసి సోమవారం ఆస్పత్రికి వచ్చాక గొంతుకు తీయాల్సిన ఎక్స్‌రే చెస్ట్‌కు తీశారని వైద్యులు తేల్చారు. ఎక్స్‌రే సరిగా లేనందున మళ్లీ తీయించుకురమ్మని చెప్పడంతో ఉసూరుమంటూ మండుటెండలో అతడి తల్లి చక్కా రాఘవ ఎక్స్‌రే విభాగం వైపు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది..
మందులు లేవు
కాకినాడకు చెందిన ఓలేటి అప్పారావుకు అకస్మాత్తుగా కాళ్లు, చేతులు పడిపోయాయి. చేపల వేట చేస్తూ జీవనం సాగించే అప్పారావు చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరాడు. చికిత్స అందించేందుకు అవసరమైన ఇమ్యునోగ్లోబ్‌లెన్స్ అందుబాటులో లేవని సిబ్బంది తేల్చేశారు.
ఇది ఉంటేనే కానీ రోగికి మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి. మందులు అందుబాటులో లేని దుస్థితి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మందు బయట కొనలేకపోతున్నామని రోగి బంధువు చెప్పాడు. అతడిని ఆసుపత్రిలోనే ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment